Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయ్యో అనోటోల్లే తప్ప ఇప్పించేటోళ్లు లేకపాయే... ఆసరా కోసం ఎదురుచూపులు
- 65 ఏండ్లకుపైన, ఇతరులు ప్రతి నెలా నష్టపోతున్నది 69 కోట్లకుపైనే
- 57 ఏండ్లకుపై వారిని కలుపుకుంటే అది వందల కోట్లలోనే ఇవ్వాల్సిన వైనం
- నిధులు లేకనే సర్కారు తాత్సారం !
- మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల చుట్టూ తిరిగినా దక్కని పింఛన్లు
- కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నోళ్లతో కలిపితే ఆశావాహులు 11 లక్షలకుపైనే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పక్కఫొటోలోని వ్యక్తి పేరు గొట్టె యాదయ్య. ఈయనది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్. అనారోగ్య సమస్యలతో ఏడాది కిందట ఉస్మానియా ఆస్పత్రిలో కుడికాలును వైద్యులు తీసేశారు. దీంతో ఆయన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఇద్దరు ఆడబిడ్డల పెండ్లిండ్లకు చేసిన ఏడెనిమిది లక్షల అప్పు ఎలా తీర్చాలో అర్థంకాని పరిస్థితి. భార్య సంపాదనతోనే కుటుంబం గడవడమూ కష్టమవుతున్నది. ఇంతటి కష్టకాలంలో సర్కారు 'ఆసరా' అయినా దక్కకపోతుందా? అనే ఆశతో ఒంటికాలుతో శక్తినంతా కూడదీసుకుంటూ ఆయన ఎక్కని ఆఫీసు మెట్లు లేవు. వేడుకోని అధికారీ లేడు. మండలాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక మూడుసార్లు కలెక్టరేట్ గడపా తట్టాడు. కలెక్టరూ 'త్వరలోనే వస్తుంది' చెప్పి పంపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కాడ్కిపోతే 'పింఛన్ వచ్చేలా చూడండి' అంటూ లెటర్‌ప్యాడ్ రాసిచ్చి అధికారులను కలవండి అని చెప్పారు. పక్క ఊరు తుర్కయంజాల్‌కు మంత్రులు కే.తారకరామారావు, సబితాఇంద్రారెడ్డి వచ్చారని తెలిస్తే వారివద్దకూ పోయి మొరపెటు ్టకున్నాడు. 'ఆ బాబారు ఎట్టుంది? ఫస్టు నుంచి పింఛన్ వస్తుందిలే..' అని కేటీఆర్ హామీనిచ్చారంట. మంత్రి సబితాఇంద్రారెడ్డి కాగితాలనూ తీసుకుని పోయిందంట. ఇలా కనిపించినోళ్లకల్లా మొరపెట్టుకున్నా నేటికీ పింఛన్ అందితే ఒట్టు. ఆయన ధైన్యస్థితి చూసినవాళ్లెవరైనా అయ్యో అనోటోళ్లే. ఇగొస్తది..అగొస్తది అని చెప్పినోల్లేగానీ 'ఆసరా' మాత్రం చూపలేదు. మరె మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ ప్రకారమైనా మార్చి ఒకటో తేదీ నుంచి పింఛన్ వస్తుందేమో చూడాలి.
పింఛన్ల కోసం దరఖాస్తులు పెట్టుకుని బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో పడుతున్న బాధలేంటో చెప్పటానికి యాదయ్య ఒక్క ఉదహరణ చాలు. ఇలాంటివి కోకొల్లలు. ప్రతి సోమవారమూ కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ 'ఎప్పుడొస్తుంది' సారూ అని పదే పదే అడుగుతుండటం...అధికారులు చికాకు పడటం షరామామూలైపోయింది. అయినా, పదేపదే మొరపెట్టుకుంటేనైనా పింఛన్ వస్తుందనే ఆశతో ఆశావాహులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర సర్కారేమో నిధులను విదల్చట్లేదు. ప్రభుత్వం ఇప్పటివరకూ పది కేటగిరీల్లో (వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ రోగులు, బోధకాలు, కళాకారులు) పింఛన్లను ఇస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారు 36.40 లక్షల వరకు ఉన్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా 2018 ముందస్తు ఎన్నికల తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. 65 ఏండ్లకుపైబడినవారు, వికలాంగులు, వితంతువులు, ఇతర అర్హత కలినవారు 3.15 లక్షల మందికిపైగా ఉన్నారు. రైతు స్వరాజ్య వేదిక సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వితంతువులే 1,59,452 మంది ఉన్నట్టు సెర్ప్ సమాచారం ఇచ్చింది. వీరంతా పింఛన్‌కు అర్హులని రాష్ట్ర సర్కారు కూడా తేల్చింది. కానీ, బడ్జెట్లోనే వీరికి కేటాయింపులు చేయడం లేదు. అందులో వికలాంగులు 55,619 మంది ఉన్నారు. వీరంతా సొంతపనులు చేసుకోనివారు, ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నవారే. వీరికి కూడా కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు. సెర్ప్ గణాంకాల ప్రకారం రాష్ట్ర సర్కారు తాత్సారం చేస్తూ ప్రతినెలా 16.77 కోట్ల రూపాయలను మిగిల్చుకుంటున్నదని తేలింది. 2019 నుంచి 65 ఏండ్లకు పైబడి అర్హులైన వృద్ధులకు, ఇతరులకు ప్రతి నెలా రూ.52.34 కోట్ల పింఛన్లను ఇవ్వట్లేదు. మొత్తంగా కొత్త పింఛన్లను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.69.11 కోట్లను ఇతరత్రా అవసరాలకు వాడుకుంటున్నదని తేటతెల్లమవుతున్నది. వాస్తవానికి ఎవరైనా చనిపోయినా, అనర్హులను జాబితా నుంచి తొలగించినా కొత్తగా ఆస్థానంలో వేరే వారికి ఆ పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు రాష్ట్ర సర్కారు ఆ పనినీ విస్మరిస్తున్నది. ముందస్తు ఎన్నికల తర్వాత మూడు బడ్జెట్లలో కొత్త పింఛన్ల మంజూరవుతాయని ఆశించిన వారికి ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నది. ఇగో ఈ బడ్జెట్లో పెడతాం...ఇగ ఈసారి వచ్చినట్టే అని పలు వేదికలపై మంత్రులు చెబుతున్నప్పటికీ ఆశావాహుల కల మాత్రం నెరవేరడం లేదు. 'నల్లగొండ జిల్లా చండూరు మండలం తేరట్పల్లి ఒక్క గ్రామంలోనే 40మందికిపైగా వితంతువులు పింఛన్ల కోసం అర్జీ పెట్టుకుని కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు' అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొట్ట శివ తెలిపారు.
65 ఏండ్లే కాదు 57 ఏండ్లున్నవారికీ పింఛన్ ఇస్తామని రాష్ట్ర సర్కారు 2020 మార్చి ఎనిమిదో తేదీన ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 10,84,500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 57 నుంచి 65 ఏండ్ల మధ్యలో ఉన్నవారు. రమారమి ఎనిమిది లక్షల మందిదాకా ఉన్నారు. మిగతావారు ఇతర విభాగాల వారున్నారు. వీరు కూడా దరఖాస్తు చేసుకుని పింఛన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అప్రూవల్ అయినప్పటికీ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్లనే కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని ఉన్నతాధికారులే చెబుతున్నారు. అందరికీ పింఛన్లు ఇస్తే ఖజానాపై మరింత భారం పడే అవకాశం ఉందనే కారణంతోనే రాష్ట్ర సర్కారు నాన్చుతుందనే విమర్శ వస్తున్నది.