Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ భద్రత కల్పించాలి:డీఎంఈకి టియుఎంహెచ్ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని కాంట్రాక్టు వర్కర్లకు వేతనాలు పెంచాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ నేతృత్వంలో నాయకులు రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై డిఎంఈకి వివరించారు. ఈ సందర్భంగా డీఎంఈ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ మార్చిలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సానుకూలంగా ఉన్నారనీ, వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారని రమేశ్ రెడ్డి వెల్లడించారు.
అనంతరం భూపాల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. వైద్య విధాన పరిషత్, వైద్య విద్య, ఆయుష్ తదితర విభాగాల్లోని ఆస్పత్రులు, కాలేజీల్లో ఏండ్ల తరబడి కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు. వారిలో ఫ్రధానంగా శానిటేషన్ పేషెంట్ కేర్, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, ఆఫీస్ సబ్ స్టాఫ్, తదితరులున్నారని తెలిపారు. రూ.ఆరు వేల నుంచి రూ.తొమ్మిది వేల నామమాత్రపు వేతనాలకు వెట్టిచాకిరి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం జీవో నెంబర్ 60 ద్వారా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచినా హాస్పిటల్ వర్కర్లకు అమలు చేయలేదని విమర్శించారు. పీఎఫ్, ఈఎస్ఐ, సెలవులు, రక్షణ సౌకర్యాలు సరిగ్గా అమలు చేయడం లేదనీ, కరోనా కాలంలో సేవలు అందించినందుకు ప్రభుత్వం ఇస్తామన్న ఇన్సెంటివ్లు ఇవ్వలేదనీ, ఆస్పత్రుల్లో పని చేసే వర్కర్లందరికీ వేతనాలు పెంచాలని కోరారు.
ఆస్పత్రుల్లో పని చేసే కార్మికులకు జీవో నెంబర్ 68 ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ జీవో కాలపరిమితి ఐదేండ్లు ముగిసిన అనంతరం జీవో నెంబర్ 306ను కార్మికశాఖ విడుదల చేసిందని గుర్తుచేశారు. ఈ జీవో ప్రకారం రూ.16,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ జీవోను నిమ్స్ లోని శానిటేషన్, స్వీపర్లు, పేషెంట్ కేర్ తదితర సిబ్బందికి అమలు చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ వర్కర్లకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం జీతాలు పెంచుతూ జీవో జారీ చేసిందనీ, ఒకే రాష్ట్రంలో ఒకే రకమైన పని చేసే వారికి వివిధ రకాల జీతాలు అమలవుతున్నాయని చెప్పారు.
వేతనాలు పెంచుతామని చెప్పినా ఆచరణకు నోచుకోవడం లేదని చెప్పారు. ఆస్పత్రుల వర్కర్ల సమస్యలు తక్షణమే స్పందించిసీఎం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎంఈని కలిసిన వారిలో ఆ యూనియన్ కోశాధికారి ఎండి ఫసియొద్దీన్, రాష్ట్ర కార్యదర్శి వి.విజయవర్థన్ రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు నవీన్ కుమార్, రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి యూనియన్ నాయకులు అక్రమ్ ఖాన్, శారద, కుమార్, రమా, రవి, శ్రీనివాస్, అంజి, వెంకన్న, శోభ, సుమలత, సౌరయ్య తదితరులు పాల్గొన్నారు.