Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ అసమ్మతి నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్, సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. అందులో అసంతృప్త నేతలకు నాయకత్వం వహిస్తున్న గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్రావు, నాగురావు నమోజీ, రాములు, ఏ.శ్రీనివాస్, చింతా సాంబమూర్తి, పద్మజ, తదితరులు పాల్గొన్నారు. బీజేపీలోని సీనియర్లలో కొందరు బండి సంజరు తీరుకు వ్యతిరేకంగా పలుమార్లు సమావేశం అయిన విషయం విదితమే. ఈ విషయం జాతీయ అధిష్టానం దృష్టికి వెళ్లింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో పార్టీలో విభేదాలు సరిగాదని కేంద్ర నాయకత్వం సూచించింది. దీంతో బండి సంజరు వారితో సమావేశం అయినట్టు తెలుస్తున్నది. అసమ్మతి నేతలు కూడా ఒక మెట్టు దిగి వచ్చి పార్టీ లైన్లోనే ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు మెత్తబడ్డారు. జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టడంతో తాము మీటింగ్ పెట్టుకున్నది పార్టీ బలోపేతానికేనని వెల్లడించారు. రహస్య సమావేశాల వార్తలను ఖండించారు. బీజేపీ జాతీయ జనరల్ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో వస్తున్న భేదాభిప్రాయాలను అరికట్టి పార్టీని బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపైనా ఆయన సూచనలు చేయనున్నట్టు తెలిసింది.