Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలూరు గౌరీశంకర్
- సాహిత్య అకాడమి యువపురస్కార గ్రహీత గోపాల్‌కు ఘనసన్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ పల్లె మట్టికి ప్రత్యేకత ఉందనీ, ఈ ప్రాంత గ్రామీణ యువత రాష్ట్రానికి గొప్ప సంపద అని సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కళల విభాగం ఆధ్వర్యంలో భాషా సాహిత్య వేదిక ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పల్లెలు సాహిత్య వేదికలుగా మారాయన్నారు. ఈ మట్టిలోనే సాహిత్య కుసుమాలున్నాయని అన్నారు. గోపాల్ రచించిన దండకడియం కేంద్ర సాహిత్య అకాడమి యువపురస్కారం పొందడం ఆ కోవలోకి వస్తుందని చెప్పారు. అధ్యక్షత వహించిన వర్సిటీ వీసీ కె సీతారామారావు మాట్లాడుతూ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారిందన్నారు. ఆర్థిక స్థితిగతులు బాగాలేక చదువును మధ్యలోనే ఆపేసిన లక్షలాది మంది విద్యార్థుతలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నదని వివరించారు. తమ పూర్వ విద్యార్థి గోపాల్‌ను సన్మానించడమంటే తమను తామే సన్మానించుకుంటున్నట్టు ఉందన్నారు. గోపాల్ మాట్లాడుతూ తనలాంటి ఎంతో మంది పేద విద్యార్థులను ఈ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ఈ సుధారాణి, రిజిస్ట్రార్ లక్ష్మారెడ్డి, కళల విభాగం డీన్ షకీలాఖానమ్, తెలుగు శాఖాధిపతి ఎన్ రజిని తదితరులు పాల్గొన్నారు.