Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహ్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లోనే సవరణ జాబితా ప్రకటిస్తామని జవహర్లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) వీసీ కట్టా నర్సింహ్మారెడ్డి చెప్పారు. శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ పీహెచ్డీ ప్రవేశాల కోసం విడుదల చేసిన జాబితాలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరముందని చెప్పారు. అయితే అడ్మిషన్స్ డైరెక్టర్ సిహెచ్ వెంకటరమణారెడ్డిని కాపాడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలను తప్పుపట్టారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, వర్సిటీ ప్రొఫెసర్లతో నియమించిన కమిటీ నివేదికలోనూ ఆయన తప్పు చేసినట్టు ప్రకటించలేదని వివరించారు. గతంలో పాటించిన పద్ధతులనే ఆయన అనుసరించారని గుర్తు చేశారు. అయితే పీహెచ్డీ ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక నిబంధనల్లో కొన్ని మార్పులు చేశామన్నారు. వర్సిటీ సెట్ రాసినా లేదంటే నెట్, సెట్, గేట్, జీప్యాట్‌లో అర్హత పొందిన వారికి పీహెచ్డీ ప్రవేశాలు లభిస్తాయని అన్నారు. అయితే వాటిలో ఎస్సీలకు 40 మార్కులు, బీసీలకు 45 మార్కులు, ఇతరులకు 50 మార్కులొస్తే అర్హత సాధిస్తారని వివరించారు. ఇంటర్వ్యూకు 25 మార్కులు, విద్యార్హతలకు పది మార్కులు, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురితమైతే పది మార్కులు, ఇతర అంశాలకు ఐదు మార్కులు కేటాయించాలని నిర్ణయించామని చెప్పారు. అందుకనుగుణంగా గతంలో ప్రకటించిన జాబితాను సవరించి కొత్త జాబితాను రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని వివరించారు. మెరిట్లో ఉండే ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని చెప్పారు.
వెంకటరమణారెడ్డిపై విమర్శలు...
పీహెచ్డీ ప్రవేశాల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ కేటగిరీలో ఉన్న విద్యార్థులను రిజర్వేషన్ ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించి అన్యాయం చేశారంటూ విమర్శలొచ్చాయి. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు నెట్, సెట్, గేట్లో మెరిట్ సాధించినా వారిని ఓపెన్ కేటగిరీలో పీహెచ్డీ సీటు కేటాయించకుండా, ఆయా రిజర్వేషన్ కేటగిరీలో సీటు కేటాయించడం వల్ల అన్యాయం జరిగిందని విద్యార్థులు వాపోతున్నారు.