Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్‌పై లోతైన చర్చ : సవాళ్లను అధిగమించాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బయో ఆసియా - 2022 శుక్రవారం ముగిసింది. సదస్సులో 70 దేశాల నుంచి 37,500 మంది ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న పలు అంశాలపై రెండు రోజుల పాటు వారు చర్చించారు. రెండు సంవత్సరాల కోవిడ్-19 , సవాళ్లు, మహమ్మారి అందించిన అవకాశాలు, నేర్చుకోవాల్సిన పాఠాలు అనే అంశాలపై పూర్తి అవగాహనను కల్పించే రీతిలో ఈ సదస్సును నిర్వహించారు. పారిశ్రామికవేత్తల నుంచి సామాన్యుల వరకు పాల్గొన్న సదస్సు జీవ శాస్త్రాలకు సంబంధించి లోతుగా చర్చించారు.
రెండో రోజు కీలకపోన్యాసాన్ని అలెక్స్ గోర్స్కీ ఇవ్వగా బయో ఆసియా అంతర్జాతీయ సలహా మండలి చైర్మెన్ డాక్టర్ అజిత్ శెట్టి మోడరేటర్‌గా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ లైఫ్ సైన్సెస్, ఫార్మా విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. గోర్స్కీ మాట్లాడుతూ ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో నూతన వైద్య ఆవిష్కరణలను, వాటి సరఫరా వ్యవస్థను వేగంగా అందించగలగాలనీ, అందుకోసం అవసరమైన భాగస్వాములతో ఒప్పందాలను చేసుకోవాలని సూచించారు. వాల్యూ చైన్‌ను వృద్ధి చేయడం ...స్థిరమైన భవిష్యత్‌కు దారి తీస్తుందని తెలిపారు. ఫార్మా, బయో ఫార్మా రంగాలలో (ఎఫ్ఏబీఏ) ఆవిష్కరణలను తీర్చిదిద్దడంలో సవాళ్లు, అత్యాధునిక తయారీ, నాణ్యతపై దృష్టి, స్ధిరమైన సరఫరా చైన్‌తో ప్రాధాన్యత, నమ్మకమైన అంతర్జాతీయ డ్రగ్ సరఫరాదారునిగా మారడం, తదితర అంశాలపై సదస్సులో చర్చించారు.
అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం....జయేష్ రంజన్
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సదస్సులో తెలిపారు. ఇలాంటి భాగస్వామ్యతో పరిష్కారాలను వేగవంతంగా తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. శక్తి నాగప్పన్ మాట్లాడుతూ, బయో ఆసియా సదస్సు భవిష్యత్తును ఆశాజనకంగా మార్చిందని తెలిపారు.