Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అక్రమ లే అవుట్లల్లోని జాగాలు, గృహాలు, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ 2020లో ఇచ్చిన మెమోతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని హైకోర్టు అత్యంత కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి)లో వెలువడే తుది తీర్పుకు లోబడి రిజిస్ట్రేషన్లు ఉంటాయని చెప్పింది. ఇదే విషయాన్ని రిజిస్ట్రేషన్ చేసే పత్రాల్లో మొదటి పేజీ వెనుక, చివరి పేజీ వెనుక రాయలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించింది. సుమారు అయిదు వేల కేసులను పరిష్కరించినట్టుగా ప్రకటించింది. 30 అడుగులు రోడ్లకు వదలకపోయినా ఏర్పాటు చేసిన లే అవుట్లల్లోని జాగాలు, ఇండ్ల నిర్మాణాలు, అనుమతులు లేని నిర్మాణాలపై జరిగే లావాదేవీలకు కొనుగోలుదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ విజరుసేన్‌రెడ్డి కీలక ఉత్తర్వులు వెల్లడించారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, 30 అడుగుల రోడ్డు వంటి నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో బాధ్యత కూడా కొనుగోలుదారులదే అవుతుందన్నారు. ఆస్తుల క్రయ విక్రయాలు నిరంతరం జరిగే ప్రక్రియయని చెప్పారు. అనేక మంది వ్యక్తిగత అవసరాలు, కుటుంబ పరిస్థితులు, వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం క్రయ విక్రయాలు చేస్తుంటారనీ, ఈ పరిస్థితుల్లో ఆ మెమోతో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇది వరకు హైకోర్టు డివిజన్ బెంచ్ మెమోతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేస్తే దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లిందనీ, అయితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వనప్పుడు హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం ఒక్కటే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గమన్నారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఆ రిజిస్ట్రేషన్లు ఉంటాయన్నారు.
ప్రభుత్వ ఉద్ధేశం.....
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారికంగా ఆమోదించిన అధీకృత లేఔట్లల్లోని ప్లాట్లను మాత్రమే అధికారులు రిజిస్ట్రేషన్లు చేయాలి. క్రమబద్ధీకరణ చేస్తూ లేఔట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) అనుమతించి ప్లాట్లను కూడా సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయాలి. అనధికార లే అవుట్లలోని ప్లాట్లు గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్లు జరగవు. అంతేకాకుండా అనుమతులు లేని నిర్మాణాలు ఉన్నా వాటిని కూడా రిజిస్ట్రేషన్లు నిర్వహించరు. అధీకత నిర్మాణాలు మాత్రమే రిజిస్ట్రేషన్లు అవుతాయి. సంబంధిత అధికారి నుండి ఆమోదం/అనుమతి పొంది ఇండ్లు, భవనాలు, అపార్ట్మెంట్లు (ఫ్లాట్లు) నిర్మాణాలు చేసిన వాటినే రిజిస్ట్రేషన్లు చేయాలి. అనధికార లేఔట్లల్లోని నిర్మాణాల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు కూడా చేయకూడదు. అనుమతులు లేకుండా లే అవుట్లు వేసి అమాయక ప్రజలకు ఇండ్ల స్థలాలను విక్రయించడాన్ని నివారించే నిమిత్తం అక్రమ లేఔట్లల్లోని స్థలాల క్రయవిక్రయాలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ 2020 ఆగస్టు 26న జారీ చేసిన మెమో (జీ2/257/2019) అమలును నిలిపివేస్తూ గతంలో డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేస్తే స్టే ఉత్తర్వులు జారీ కాలేదు.
ఈ నేపథ్యంలో తమ స్థలాలు, ఇండ్లు, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు నిరాకరిస్తున్నారని సుమారు ఐదు వేల మంది హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. లేఔట్లు వేసినప్పుడు అధికారులు చర్యలు తీసుకోకుండా తాము కొనుగోలు చేసిన తర్వాత వాటి క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించడం ఏకపక్షమనీ, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని పిటిషనర్లు హైకోర్టును అభ్యర్థించారు. సేల్ డీడ్స్, గిఫ్ట్ డీడ్స్ రిజిస్ట్రార్ చేసేందుకు రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రార్లు నిరాకరించచడం చట్ట వ్యతిరేక చర్యగా ప్రకటించాలని ఐదు వేల మంది వేసిన పలు కేసుల్లో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. రిజిస్ట్రేషన్లు తిరస్కరించే అధికారం సబ్ రిజిస్టార్లకు లేదని పిటిషనర్ల వాదన. చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన లే అవుట్లను అనుమతిస్తే ఇదే తరహా లే అవుట్లు పట్టుకొస్తాయని ప్రభుత్వం వాదించింది. 30 అడుగులు వెడల్పు లేకుండా రోడ్లు ఉంటే మౌలిక సదుపాయాలు కష్టం అవుతుందన్నారు. వాదనల తర్వాత హైకోర్టు తుది ఉత్తరులు జారీ చేసింది.