Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాపార్కు వద్ద 28న బాధితులతో బహిరంగ విచారణ : కొండల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాబోయే బడ్జెట్లో కొత్త పింఛన్లకు నిధులు కేటాయించకపోతే న్యాయపోరాటం చేస్తామనీ, పింఛన్ల కోసం పోరాడుతున్న ప్రజా సంఘాలు, స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 28న ఇందిరాపార్కు వద్ద బాధితులతో పబ్లిక్ ఇయరింగ్ నిర్వహిస్తామని రైతు స్వరాజ్య వేదిక నేత కొండల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 ముందస్తు ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలు ఉన్న ప్రాంతాల్లోని కొందరికి తప్ప ఎక్కడా పింఛన్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. 57 ఏండ్లకే పింఛన్ల హామీతో దరఖాస్తు చేసుకున్న 11 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారనీ, వాటికి పరిష్కారం చూపకుండా రాష్ట్ర సర్కారు జాప్యం చేస్తోందని విమర్శించారు. 65 ఏండ్లు దాటినవారు, వికలాంగులు, వితంతువులు, ఇతర విభాగాల వారే మూడు లక్షలకుగా పైగా ఉన్నారని తెలిపారు. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారిలో ఎక్కువగా చిన్న,సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలే ఉన్నారని పేర్కొన్నారు. ఏ రోజు నుంచి అర్హుల అవుతారో అప్పటి నుంచి లెక్కగట్టి బకాయిలతో సహా పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.