Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరుద్యోగులను మోసం చేస్తున్న సర్కార్
- టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు డీవైఎఫ్ఐ ధర్నా
- పోలీసుల అరెస్టులు
- ఉద్యమాన్ని ఆపలేరంటూ హెచ్చరిక : డీవైఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'రాష్ట్ర ప్రభుత్వం కొలువుల భర్తీకి నీళ్లొదిలింది. యువతను మోసం చేస్తున్నది. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఆత్మహత్యలకు కారణమవుతున్నదని' డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్,అనగంటి వెంకటేశ్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వస్తే నియమకాలు వాటంతటవే వస్తాయని చెప్పిన నాయకులు, ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి కొట్లాడిన యువతకు నిరాశే మిగిలిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు నిరుద్యోగులను మోసం చేసేందుకు కల్లబొల్లి కబుర్లు చెప్పడం సీఎం కేసీఆర్కు ఆనవాయితీగా మారిందని విమర్శించారు. అందరికీ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి తదితర వాగ్దానాలన్నీ నీటిమీది రాతలుగా మారాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీఆర్ బిశ్వాల్ కమిటి రాష్ట్రంలో వివిధ శాఖల్లో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు.అయినా ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయటం లేదో సర్కార్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయటం వల్లనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయనీ, అందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు.యువతను పట్టించుకోని ప్రభుత్వమేదీ మనగలగలేదని గుర్తుచేశారు. టీఎస్పీఎస్సీ అనేది ఉత్సవ విగ్రహంగా మారిందని విమర్శించారు. మూడేండ్లుగా ఏ ఒక్క నోటిఫికేషన్ వేయకుండా నిద్రావస్థలో ఉందని దుయ్యబట్టారు. మన రాష్ట్రం మన పాలన అంటూ చెప్పిన టీఆర్ఎస్ నేతలు, అధికారంలోకి వచ్చినంక నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా చేశారని చెప్పారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే..బలవంతంగా పోలీసులు అరెస్టులు చేయటమేంటని ప్రశ్నించారు. అరెస్టులెప్పుడూ ఉద్యమాలను ఆపలేవని హెచ్చరించారు.
అసెంబ్లీ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి
యువజనులు, నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు వేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేదంటే అసెంబ్లీ ముట్టడి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్, సిల్వేరు రాజు, కృష్ణా నాయక్, దినేష్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.