Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్ ర్యాకింగ్‌తో రాష్ట్రాల మధ్య పోటీ పెంచాలి
- నెట్ జీరో కార్బన్ లక్ష్యసాధన దిశగా ప్రోత్సహించాలి
- అటవీ శాఖ జాతీయ వర్క్‌షాపులో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పట్టణాభివృద్ధితో పాటు పచ్చదనం పెంపూ దేశాభివృద్ధికి చాలా ముఖ్యమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సరళతర వాణిజ్య విధానంలాగానే పచ్చదనం పెంపు విషయంలోనూ రాష్ట్రాల మధ్య పోటీతత్వం కోసం గ్రీన్ ర్యాకింగ్ విధానాన్ని తేవాలని కేంద్రాన్ని కోరారు. బాగా పనిచేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా కాంపా నిధులను అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో అటవీ శాఖ జాతీయ వర్క్‌షాప్‌ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో అటవీశాఖ నిర్వహణ, కంపా నిధులు సద్వినియోగం, అటవీ పునరుద్ధరణ పనులపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అటవీశాఖలో ఇద్దరు కీలక అధికారులతో పాటు ఆ శాఖలో 44 శాతానిపైగా మహిళలే సేవలందిస్తుండటంపై ప్రశంసించారు. తెలంగాణ, హైదరాబాద్ ఈవోడీబీ ర్యాంకులతో పాటు పచ్చదనం పెంపులోనూ అగ్రగామిగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు దేశంలోని మరే నగరంలోనూ లేవని చెప్పారు. ఉపాధి హామీ నిధులను పచ్చదనం పెంపు కోసం సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రాల తరహాలో అటవీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. హరితహారంతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని వివరించారు. సీడ్ బాల్స్ వేసేందుకు డ్రోన్లను కూడా వినియోగించామని తెలిపారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ..హరితహారంలో భాగంగా అటవీ ప్రాంతం వెలుపల 130 కోట్లు, అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. జంగిల్ బచావో- జంగిల్ బడావో నినాదంతో రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్ద ఎత్తున మొక్కలను నాటామన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామనీ, ఇప్పటివరకూ 53 పూర్తయ్యాయని చెప్పారు. అడవుల పునరుద్ధరణ కోసం హరితనిధి ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డీజీ, ప్రత్యేక కార్యదర్శి చంద్ర ప్రకాశ్గోయల్, అదనపు డీజీ, జాతీయ కాంపా సీఈఓ సుభాష్ మాట్లాడుతూ...అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశసించారు. పచ్చదనం పెరుగుదలలో గణనీయమైన వృద్ధి తెలంగాణ సాధించిందని అభినందించారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ విధానాలను అనుసరించాలని సూచించారు. గ్రీన్ ర్యాకింగ్ విషయంపై కేటీఆర్ చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ (కాంపా సీఈవో) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, ఇతర రాష్ట్రాలకు చెందిన పీసీసీఎఫ్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.