Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంజూరు ఒకచోట.. నిర్వహణ మరోచోట
- అద్దె భవనాల్లో విద్యార్థుల ఇక్కట్లు
నవతెలంగాణ- నల్లగొండ
కేజీ టు పీజీ వరకు నిర్బంధ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కానీ, వాటికి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణంలో, మౌలిక వసతుల కల్పనలో జాప్యం జరుగుతోంది. దీంతో గురుకుల సొసైటీలు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎక్కడ అద్దె భవనం దొరికితే అక్కడ వాటిని ప్రారంభిస్తున్నారు. అద్దె భవనాల్లోనూ కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 24 గురుకుల విద్యా సంస్థలున్నాయి. 2014 తర్వాత విడతల వారీగా కొత్త పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 62 కొత్త గురుకుల విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయి వరకే కొనసాగిన ఈ విద్యా సంస్థలు క్రమంగా జూనియర్ కాలేజీ స్థాయికి అప్గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ఏర్పాటైన వాటిలో 30 శాతం పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా మారినట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం శాశ్వత భవనాల దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా మంజూరైన పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అదీ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాంతంలో కాకుండా భవనాలు అందుబాటులో ఉన్న చోట వాటిని ప్రారంభించారు. ఈ కారణంగానే ఒకచోట ఉండాల్సిన గురుకుల పాఠశాల ఆ పేరుతో మరో ప్రాంతంలో ఉంటోంది.
అద్దెకూ దొరకని పరిస్థితి..
గురుకుల పాఠశాల నిర్వహణకు సగటున 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, విశాలమైన మైదానం ఉన్న భవనం అవసరం. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాలు దొరకడం కష్టమే. ఈ క్రమంలో దాదాపు అన్ని సొసైటీలు మూతపడిన ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల భవనాలను గుర్తించి యజమానులతో అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరగడంతో నిర్వహణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా తాగునీరు, వాడుక నీరు సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బోధన సిబ్బంది కొరత కూడా ఉంది. భద్రత విషయంలో కూడా సమస్యలు తలెత్తుతున్నట్టు కళాశాల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని చూడాలంటే వ్యయ ప్రయాసలకోర్చి 30 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి రావాల్సి వస్తోంది.
ఇక్కడి గురుకులాలు మరెక్కడో..
చండూరు, అనుముల, తిప్పర్తి, నిడమనూరు మండలాల ఎస్సీ గురుకుల పాఠశాలకు ప్రభుత్వ పక్కా భవనం లేకపోవడంతో నల్లగొండ జిల్లా కేంద్రంలోని డాన్ బోస్కో పాఠశాల, పొపుపాల్ కాలేజీ, రామానందతీర్థ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్నాయి. నకిరేకల్ మండలం చందుపట్లకు మంజూరైన మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డులో ఉన్న రాఘవేంద్ర కాలేజీలో, మునుగోడుకు మంజూరైన పాఠశాలను దేవరకొండ రోడ్డులోని రెడ్డి హాస్టల్లో నిర్వహిస్తున్నారు.
అద్దె భవనాల్లో అన్ని సదుపాయాలు
ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం భూముల కేటాయింపు జరిగింది. భవనాలు పూర్తి అయ్యే వరకు అద్దె భవనాల్లో నిర్వహిస్తాం. అంతవరకు అద్దె భవనాల్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తాం.
ఎస్సీ గురుకులాల ఆర్సీవో అరుణ కుమారి- బీసీ గురుకులాల ఆర్సీవో షకీన
పక్కా భవనాలు, మౌలిక వసతులు అత్యవసరం
గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి, సరైన మౌలిక వసతులు కల్పించాలి. శాశ్వత భవనాల మంజూరు కోసం ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేదు. సరైన వాతావరణం ఉంటేనే విద్యార్థులు చదువుకోగలుగుతారు. ఆ వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి. గురుకుల పాఠశాల విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యతమైన ఆహారాన్ని అందించాలి.
డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్