Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- రాజేంద్రనగర్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ప్రపంచంలోని ఇతర దేశాలకు విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వకారణమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాన్ని మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు కేవలం మెట్ట పంటలకే పరిమితమైన తెలంగాణ, రాష్ట్రం సాధించాక, సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణిగా మారిందన్నారు. తెలంగాణ నాణ్యమైన పంటలకు పెట్టింది పేరుగా తయారైందని తెలిపారు. కేవలం మన రాష్ట్రానికే కాక ఇతర దేశాలకూ విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళటం గర్వకారణమన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయిందని చెప్పారు. ఇదంతా సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమయిందని తెలిపారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో తెలంగాణ మరింత ముందుకు వెళ్తుందన్నారు. తెలంగాణలో ఇంచు భూమి కూడా వదలకుండా వ్యవసాయ రంగానికి ఉపయోగించుకుంటున్నారన్నారు. ఇంకా రైతులకు మేలైన విత్తనాలను అందించడానికి శాస్త్రవేత్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ మొదటి నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ విత్తనాల హబ్‌గా మారిందన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో మరిన్ని అద్భుతాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ కేశవులు, వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, చైర్పర్సన్ అనితా రెడ్డి, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.