Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీ పాలన తీరేంటి...?
- ఉమ్మడి ఏపీలోనే టీచర్ల నియామకాలు.. ఇప్పుడా ఊసే లేదు : విలేకర్ల సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన
- బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షలేంటి..? వాటికి భిన్నంగా ఇప్పుడు మీ పరిపాలనా తీరేంటి...?' అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ జి.హరగోపాల్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారనీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఊసే లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో పని చేస్తున్న లెక్చరర్లు 16,17 ఏండ్ల నుంచి తమ కొలువులు పర్మినెంట్ కాకపోవటంతో గోసను అనుభవిస్తున్నారని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో హరగోపాల్ మాట్లాడుతూ... విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. 'తెలంగాణ వస్తే బడులకు కొత్త భవనాలు కడతారు, పాత వాటికి సున్నాలేస్తారు, మంచినీరు, కరెంటు తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు, మరుగుదొడ్లు, ప్రహరీలు నిర్మిస్తారు, ఉపాధ్యాయ నియామాకాలను చేపట్టి విద్యారంగాన్ని పటిష్టం చేస్తారని భావించాం.
వాటిపై ఎన్నో కలలుగన్నాం, ఆశించాం, ఆకాంక్షించాం... ' అని అన్నారు. కానీ అవన్నీ కల్లలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు-మన బడి అనేది వాస్తవానికి తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నినాదమని చెప్పారు. ఇప్పుడు ఆ నినాదం పేరిట రూ.ఏడు వేల కోట్లను కేటాయిస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నదని తెలిపారు. అయితే కేవలం మాటల్లో గాకుండా చేతల్లో ఆ కేటాయింపులుండాలని సూచించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అనేది కేవలం ఒక వాగ్దానంగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం ఫలితంగా అక్షరాస్యతలో దేశం మొత్తం మీద తెలంగాణ వెనుకబడిపోయిందని చెప్పారు. 'మన ఊరు- మన బడి' కోసం కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, సంపన్నులు విరాళాలివ్వాలంటూ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కోరుతున్నారని గుర్తు చేశారు. అయితే పేద పిల్లల విద్య కోసం విరాళాలిచ్చేంత దాతృత్వం కార్పొరేట్లకు ఉంటుందా..? అని ప్రశ్నించారు. అందువల్ల ఆ పథకానికి బడ్జెట్ నుంచే చాలినన్ని నిధులు కేటాయించాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.చక్రధరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మినారాయణ, పీవైఎల్ ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.