Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాల నిరసన
నవతెలంగాణ- విలేకరులు
కార్మిక, ప్రజా వ్యతిరేక.. కార్పొరేట్ అనుకూల కేంద్ర బడ్జెట్‌ను వెంటనే సవరించాలని వివిధ రంగాల కార్మికులు, ప్రజలు డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఆవాజ్, కేవీపీఎస్ తదితర సంఘాలు పాల్గొన్నాయి. అంకెల గారడీగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్.. ప్రజల ఆశలను నీరుగార్చి, కార్పొరేట్ శక్తులకు అందెలం వేసేదిగా ఉందని నాయకులు విమర్శించారు. కార్పొరేట్ అనుకూల విధానాలను వీడి.. నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసి, ప్రజానుకూల బడ్జెట్‌గా సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో బారీ నల్లజెండా చేతబూని బస్టాండ్ సమీపంలో నిరసన తెలిపారు. మైనార్టీలకు బడ్జెట్లో ఐదువేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. కోదాడ పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెట్రోల్ డిజిల్ ధరలు తగ్గించాలని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అర్వపల్లి మండల కేంద్రంలో, నేరేడుచర్లలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కాటేదాన్ చౌరస్తాలో నిరసన తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కడెం మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఖానాపూర్‌లో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నస్పూర్‌లోని కేకే-5గనిపై కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బడ్జెట్ సవరించి ప్రజానుకూల బడ్జెట్‌ను రూపొందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.
నిజామాబాద్, ఆర్మూర్‌లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయగా, బోధన్‌లో బడ్జెట్ ప్రతులు దహనం చేశారు. కామారెడ్డిలో ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
జనగామ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌కు సవరణలు చేసి ప్రజానుకూల బడ్జెట్‌గా మార్చాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఏవోకు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో బైపాస్ రోడ్‌లోని కోల్డ్ స్టోరేజ్ ఎదుట నిరసన తెలిపారు. ఖిలా వరంగల్ తహసీల్దార్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్‌కు వినతిపత్రం అందజేశారు.