Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ నమోదులో బ్యాంకర్ల అలసత్వం
- ఆఫ్లైన్ వివరాలను తీసుకోని ఇన్సూరెన్స్ కంపెనీలు
- రైతుల ఖాతాలకు చేరని పరిహారం డబ్బులు
- అధికారుల నిర్లక్ష్యం విలువ రూ.15కోట్లు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
అధికారుల నిర్లక్ష్యం.. అన్నదాతలకు తీవ్ర నష్టం చేస్తోంది. పంట నష్టపోయి ఆర్థికంగా కుదేలైన రైతులకు అండగా ఉండాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్ల బీమా పరిహారం అందకుండా పోతోంది. ప్రీమియం చెల్లించినా పంట బీమా పరిహారం రాకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఈ వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లించిన రైతుల వివరాలను అధికారులు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో బీమా కంపెనీకి పంపించారు. కానీ, సదరు కంపెనీ ఆన్లైన్ వివరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని.. ఆఫ్లైన్లో పంపించిన జాబితాను తిరస్కరించి తిరిగి బ్యాంకులకు పంపించింది. ఆ తర్వాత అయినా బ్యాంకర్లు రైతుల జాబితాను ఆన్లైన్లో పంపించకుండా నిర్లక్ష్యం చేయడంతో పరిహారం రాకుండా పోయింది. దీంతో ప్రీమియం చెల్లించి పరిహారం దక్కని వేలాది మంది రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
రైతులు పోరాడి సాధించిన పంట బీమా పథకం కొందరికే ఉపశమనం కలిగించింది. 2018-19లో బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేసే సమయంలో రైతుల నుంచి వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం మినహాయించుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 34వేల మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ఇదే సంవత్సరంలో పంటలు నష్టపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇన్సూరెన్సు కంపెనీల నుంచి నష్టపరిహారం వస్తుందనే భరోసాతో ఉన్నారు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించకపోవడంతో రైతులకు పరిహారం మంజూరులో తీవ్ర ఆలస్యం జరిగింది. దీనిపై జిల్లావ్యాప్తంగా రైతులు, వివిధ పార్టీలు పలుమార్లు నిరసనలు తెలిపి పోరాటాలు నిర్వహించారు. రైతుల నిరసనలతో దిగొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేండ్ల వ్యవధిలో తమ వాటాలు చెల్లించాయి. దీంతో ఇన్సూరెన్సు కంపెనీలు రైతులకు పంట బీమా పరిహారం విడుదల చేశాయి. ఈ జాబితాలో కొందరి రైతుల పేర్లు లేకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మొత్తం 34వేల మందిలో 25,935మందికి రూ.80.27కోట్ల పరిహారం మంజూరైంది. మిగిలిన 8వేల మంది రైతుల ఖాతాలకు పరిహారం రాలేదు.
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు..!
మూడేండ్లు పోరాడి సాధించిన పంట బీమా పరిహారం దరిచేరని రైతులు అధికారులు, బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో సుమారు 8వేల మంది, యూనియన్ బ్యాంకులో సుమారు 400మంది, ఇతర బ్యాంకుల్లో ఓ వంద మంది వరకు రైతుల ఖాతాలకు ఈ డబ్బులు జమ కాలేదని తెలుస్తోంది. వీరందరికి సంబంధించి సుమారు రూ.15కోట్లు జమ కాలేదని తెలుస్తోంది. ఆయా బ్యాంకు అధికారులు రైతుల వివరాలను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఇన్సురెన్సు కంపెనీకి జాబితా పంపించడంతో వీరి వివరాలు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రైతులకు పరిహారం అందలేదు. సదరు కంపెనీ అధికారులు కొన్ని నెలల ముందుగానే ఆఫ్లైన్లో పంపించిన రైతుల వివరాలను బ్యాంకులకు పంపించినా.. స్థానిక అధికారులు వాటిని సరిచేసి ఆన్లైన్లో పంపించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా అన్నదాతలకు పరిహారం రావడంలో ఆటంకంగా మారింది.
ప్రీమియం చెల్లించినా..రైతు పసుల మల్లయ్య- జందాపూర్
పంట బీమా పథకం కింద అప్పట్లో యూనియన్ బ్యాంకులో ప్రీమియం డబ్బులు మినహాయించుకున్నారు. ప్రస్తుతం 2018-19 ఏడాదికి సంబంధించి పంట బీమా పరిహారం మంజూరైనా ఆ జాబితాలో మా పేర్లు కనిపించడం లేదు. బ్యాంకు అధికారులను అడిగితే పేర్లు పంపించామని చెబుతున్నారు. కానీ మాకు మాత్రం పరిహారం మంజూరు కాలేదు. ఇప్పటికైనా అధికారులు జాబితా సరిచేసి మాకు పంట బీమా పరిహారం ఇప్పించేలా చూడాలి.