Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు, ప్రభుత్వం, కోర్టులకు చెబుతాం
- కాలుష్యం నుంచి వాటిని కాపాడాలి
- నదుల అనుసంధానం వృధా ప్రయాస
- వేలకోట్ల వ్యయం దండగ
- ప్రత్యేక ప్రణాళికలు అవసరం
- రాష్ట్రంపై కేంద్రం వివక్ష : రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశరావు
- నేటి నుంచి నదులపై జాతీయ సదస్సు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''నదులకు నోరు, గొంతు అవుతాం.. ప్రజలు, ప్రభుత్వం, కోర్టులకు చెబుతాం..నదుల పరిరక్షణకు ప్రజలు, ప్రభుత్వాలు సహకరించాలి..కాలుష్యంకోరల నుంచి వాటిని రక్షించాలి..రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులివ్వకుండా కేంద్రం వివక్షను ప్రదర్శిస్తున్నది..నదుల అను సంధానం వృధా ప్రయాస..సాధ్యం కాదని వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ ఇప్పటికే చెప్పారు..రాష్ట్రాల హక్కులను మోడీ సర్కారు కాలరాస్తున్నదని'' రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్, ఇండియన్ పెనిన్స్లర్ రివర్ బేసిన్స్ కౌన్సిల్ చైర్మెన్ వి. ప్రకాశరావు అన్నారు. నదులపై శని, ఆదివారాల్లో జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈనేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బి.బసవపున్నయ్యకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి...
నదులపై జాతీయ సదస్సుకు గత కారణాలేంటి, అసలు లక్ష్యమేంటి ?
నదులు మానవాళీ మనుగడకు కీలకం. రాజస్థాన్‌లో జరిగిన ప్రయోగమే ఇందుకు సాక్ష్యం. రామన్మెగాస్సెసే అవార్డు గ్రహిత, వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ ఈమేరకు నిరూపించారు. అక్కడ ఏడు నదులను పునర్జీవింపజేశారు. ఏడారిగా మారుతున్న భూములను హరితవనాలుగా మార్చారు. వేసవిలోనూ నీళ్లు ఉండేలా కృషి చేశారు. జంతు,పక్షిజాతులకు ఆసరానిచ్చారు. ఈసంగతిని జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ) అధ్యయనంలో తేలింది. ఈమేరకు స్వీడన్ దేశం రాజేంద్రసింగ్కు నోబెల్ బహుమతితో సమానమైన స్టాకహేోమ్ వాటర్ప్రైజ్ను అందజేసింది.
నదుల అనుసంధానాన్ని రాజేంద్రసింగ్ వ్యతిరేకిస్తున్నారు, జలవనరుల సంస్థ కార్పొరేషన్ చైర్మెన్‌గా మీ వైఖరేంటి ?
ఆయా బేసిన్లల్లోని నీటిని అక్కడి అవసరాలు తీరాకే తరలించాలి. నదుల అనుసంధానం కరెక్ట్కాదు అని రాజేంద్రసింగ్ చెప్పారు. జనాభాతోపాటు అవసరాలు పెరుగుతున్నాయి. పరిశ్రమలకూ నీళ్లు కావాలి. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే వాటిని అనుసంధానం చేస్తున్నారు. పర్యావరణ వ్యతిరేక చర్యలను నిరోధించాలి. ఇప్పటిదాకా వనరులను దోచుకోవడం-దాచుకోవడానికే పరిమతమయ్యాం. గత 50 ఏండ్లుగా నీటిని తోడుతూనే ఉన్నాం. వాటి రక్షణకు ఎలాంటి కార్యక్రమాలు లేవు. నిధుల కేటాయింపూ లేదు. ఇంజినీర్లకు ప్రాజెక్టులను కట్టడమే తప్ప, నీటిని భూమిలోకి ఇంకింపచేసేలా ఎలాంటి శిక్షణా లేకపోవడం దారుణం.
నదులకు హక్కులు ఉంటాయని అంటున్నారు, సరిహద్దులు నిర్ణయించాలి చెబుతున్నారు కదా ?
అవును.నదులకు హక్కులు ఉంటాయి. వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ప్రజలు, ప్రభుత్వాలపై ఉంటుంది. నదికి నోరు లేదు. నది మాట్లాడదు. ఆగ్రహిస్తుంది. ప్రళయాన్ని సృష్టిస్తుంది. వాటికి మేము గొంతు అవుతాం. ప్రజలూ ఆ బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలు, ప్రజలు, సుప్రీంకోర్టుకు చెబుతాం. పవిత్రమైన నదులను కాలుష్యకాసారాలుగా మార్చేస్తున్నాం. రకరకాల అనారోగ్య సమస్యలకు రసాయనిక కాలుష్యమే మూలం. అందుకే సరిహద్దులను నిర్ణయించాలి. వాటిని కాపాడుకోవాలి. అప్పుడే నది ఉనిఖీలో ఉంటుంది.
నదుల ప్రక్షాళన కోసం వేల కోట్లను ఖర్చుచేస్తున్నామని కేంద్రం చెబుతున్నది కదా ?
కేంద్రం మోడల్ సరికాదు. చెప్పుకోతగ్గ ప్రగతిలేదు. రాజేంద్రసింగ్ కూడా అదే చెప్పారు. వృధా ప్రయాసే తప్ప ప్రయోజనం లేదు. 2019లో నదుల మీద పనిచేసిన ఫ్రొఫెసర్ జీడీ అగర్వాల్ 90 ఏండ్ల వయస్సులో 111 రోజులపాటు నిరసదీక్ష చేశారు. చివరకు నదుల కోసం ఆయన ప్రాణాలు వదిలారు. నిరసన కాలంలో మోడీ ఒక్కనాడు అగర్వాల్‌ను పరామర్శించలేదు. అయన చనిపోయాక ట్విట్ చేయడం బాధాకరం.
నదుల మ్యానిఫెస్టో ఎందుకంటారు ?
నదులను రక్షించుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు అవసరం. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలాంటివి లేవు. దృష్టి అసలే లేదు. నీటి పట్ల అవగాహన కచ్చితంగా ఉండాలి. రాజేంద్రసింగ్ నేతృత్వంలో నిరంతర ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే పలుచోట్ల చర్చలు జరిగాయి. ఏప్రిల్ 14న ఢిల్లీలో మరో సదస్సు జరగనుంది. జులైలో తుది రూపమిస్తాం.
ప్రభుత్వాలు, ప్రజలు, స్వచ్చంధ సంస్థలకు మ్యానిఫెస్టోను అందజేస్తాం. అది అందరికీ పోరాడే ఆయుధంగా ఉంటుంది.
రాష్ట్రంలోని ప్రాజెక్టులు సరైన దిశలోనే నడుస్తున్నాయా ?
దేశంలో నీళ్ల సోయి ఉన్న ఒకే ఒక సీఎం కేసీఆర్. మొక్కలనూ నాటుతున్నారు. బయోడైవర్సిటీనీ కాపాడుతున్నారు. వచ్చే వందేండ్ల వరకు కరువు రాకుండా చేశారు. భూగర్భ జలాలను పెంచారు. 'వాలంతరి'ని సరైన దిశలో వాడుకోవాలని నా సూచన. ప్రాజెక్టులను పూర్తిఅవగాహనతో నిర్మిస్తున్నారు. కాలువల నిర్మాణం ఆలస్యమవుతున్న మాట వాస్తవం.