Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు రోజుల్లో రూ.20కి ఎగబాకిన వైనం
- మరో వారంలో రూ.200 దాటే అవకాశం
- కంపెనీ ఔట్లెట్ల వద్ద క్యూ కడుతున్న వినియోగదారులు
- దిగుమతులు ఆగాయన్న సాకుతో...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. మూడు రోజుల్లో లీటర్‌కు నూనె ప్యాకెట్‌కు ధర రూ.20లకు ఎకబాకింది. రిటైల్‌లో లీటర్ నూనె ధర రూ. 140 నుంచి రూ 160 వరకు పెరిగింది. హోల్‌సేల్‌లో లీటర్ సన్‌ప్లవర్ నూనె ధర రూ 144 నుంచి రూ 157కు చేరింది. మరోవారం రోజుల్లో లీటర్ నూనె ధర రూ 200లకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. కరోనా సమయంలో విదేశాల నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో లీటర్ ధర రూ 200 దాటింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగడంతో మళ్లీ ఆ సాకుతో వంట నూనెల ధరలు పైపైకి పోతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఔట్లేట్ల వద్ద వినియోగదారులు క్యూలు కడుతున్నారు. రిటైల్ వ్యాపారులు సైతం కాటన్ల కొద్ది కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరిగే అవకాశం ఉందన్న విషయం దావానంలా వ్యాప్తి చెందడంతో వ్యాపారులు నిల్వలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా యుద్దం ప్రభావంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది.
వంటింటిలో మంటలు
నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. టమాట మినహా కూరగాయలు ధరలు దిగిరానంటున్నాయి. వీటితోపాటు పెట్రోల్ ధర లీటర్‌కు గతేడాది నవంబర్ మొదటివారంలో రూ 114.09 ఉండగా, నివియోగదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో దాన్ని నవంబర్ 30న కేంద్ర ప్రభుత్వం లీటర్‌కు ఆరు రూపాయలు తగ్గించింది. తాజాగా లీటర్‌కు నాలుగు రూపాయల చొప్పున మళ్లీ పెట్రోలు ధరలు పెరిగే అవకాశంఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతున్నది.ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడికి దిగింది. అందులో భాగంగా ఓడరేవులపై రష్యా అత్యవసర పరిస్థితులను విధించింది. దీంతో ఎక్కడి ఓడలు అక్కడే నిలిచిపోవడంతో నూనెల దిగుమతి బంద్ అయింది. దేశంలో ఉన్న నిల్వలు ఉపయోగించుకోవడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి.
నెలకు 10 లక్షల టన్నుల దిగుమతి
భారతదేశం వినియోగిస్తున్న పామాయిల్, సన్‌ప్లవర్ నూనెలు ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతాయి. నెలకు 10 లక్షల టన్నుల నూనెలను మన దేశం దిగుమతి చేసుకుంటున్నది. చెన్నై, కాకినాడ, మంగళూరు, కృష్ణపట్నం ఓడరేవులు ద్వారా ఇది దిగుమతి అవుతున్నది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ 70వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో నెలకు 30వేల టన్నుల నూనె దిగుమతి అవుతుండగా, రోజుకు 2500 టన్నులు వినియోగిస్తున్నారు. జనవరి 15 వరకు లీటర్ నూనె రూ 134 మాత్రమే ఉన్నది. పిబ్రవరి 22 వరకు నాలుగు రూపాయలు మాత్రమే పెరిగింది.కానీ తాజాగా ఆ ధర మరింత పెరిగి లీటర్ రూ 160కి చేరుకుని వినియోగదారులను కలవరపెడుతున్నది.
కృత్రిమ కొరత సృష్టించారు
టి సాగర్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతు సంఘం
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభంకాగనే వ్యాపారులు కృత్రిమ నూనెల కొరత సృష్టిస్తున్నారు. ఆపై ధరలూ పెంచుతున్నారు. ఇప్పటికే నిత్యావస్తువుల ధరలు పెరగడంతో వినియోగదారులపై భారంపడుతున్నది. నూనెల ధరలు పెంచడంతో ఆ భారం మరింత పెరుగుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న ధరలపై నియంత్రణ చేయాలి.