Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల వేడుకోలు
- ఇక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయని ఆవేదన
- ఉక్రెయిన్‌లో పరిస్థితులను 'నవతెలంగాణ'కు వివరించిన విద్యార్థులు
నవతెలంగాణ-హుస్నాబాద్
'ఉక్రెయిన్‌లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మాకు భయంగా ఉంది. మమ్మల్ని ఎలాగైనా ఇండియాకి పంపించే ఏర్పాట్లు చేయండి' అని అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తగరం మనాలి, జనగాని విశాల్ కిరణ్ 'నవతెలంగాణ'తో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు. మనాలి.. ఉక్రెయిన్‌లోని జఫ్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. విశాల్ కిరణ్.. అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పౌర విమానాశ్రయాలను మూసివేశారు. భారత్‌కు వచ్చేందుకు టిక్కెట్ బుక్ చేసుకున్న మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పిల్లలు తిరిగి వస్తున్నారని ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు విమానాలు రద్దు కావడంతో తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
మనాలితోపాటు సికింద్రాబాద్‌కు చెందిన ఎర్రంశెట్టి నాగస్నిగ్ధ, కాకినాడకు చెందిన కామాడి లక్ష్మీకీర్తన, హైదరాబాద్‌కు చెందిన బంగారి ఐశ్వర్య, అమలాపురానికి చెందిన సలాడి గంగాభవాని కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు వారి ఆవేదనను నవతెలంగాణతో పంచుకున్నారు. పరిస్థితి అంతా బాగానే ఉందని అనుకున్నామని, ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొనడంతో 24 గంటల్లో పరిస్థితి మారిపోవడంతో ఇప్పుడు మాకు టెన్షన్ మొదలైందని చెప్పారు. గురువారం వరకు ఇంటర్నెట్ పనిచేసిందని, శుక్రవారం ఉదయం నుంచి నెట్ కూడా రావడం లేదన్నారు. తమ స్నేహితులు కొందరు రేపు, ఎల్లుండి ఇండియా వెళ్లిపోదామని టిక్కెట్లు బుక్ చేసుకున్నారనీ, కానీ విమానాశ్రయాలు మూతపడటంతో భయం భయంగా ఉంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎవరు ఎక్కడ ఉంటే అక్కడే ఉండండి అంటూ తాము చదువుతున్న యూనివర్సిటీ నుంచి మేసేజ్ వచ్చిందని చెప్పారు. దాంతో తాము ఎక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించడం లేదన్నారు. మా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామని, అయితే ఇక్కడున్న పరిస్థితిని వాళ్లు టీవీల్లో చూసి కంగారు పడిపోతున్నారని ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్ టీఎస్) ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు తమ కుటుంబాలతో మాట్లాడేందుకు ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినా, తెలంగాణ నుంచి ఆ ప్రయత్నం జరగలేదని వాపోయారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించడానికి ఏపీ ప్రభుత్వం ఇద్దరు అధికారులను నియమించింది. నోడల్ అధికారిగా రవి శంకర్ ఫోన్ నంబర్ 9871999055 (ఏపీ భవన్), అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేశ్ శర్మ (సంప్రదించాల్సిన నంబర్ 7531904820)లకు బాధ్యతలు అప్పగించింది.
పరిస్థితి ఎలా ఉంటుందో?
తాము వచ్చేద్దామని అనుకున్నా కూడా విమాన ఛార్జీలు అధికంగా ఉండటంతో రాలేకపోయామని విద్యార్థులు చెబుతున్నారు. ధరలు తగ్గుతాయని, ఉద్రిక్తతలు కూడా అదుపులోకి వస్తాయని భావించినా, అంతా రివర్స్ అయిపోయిందంటున్నారు. ఇప్పుడు డబ్బులు ఎంతైనా పెట్టి వచ్చేద్దామని అనుకునేవారు కూడా రాలేని పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. సాధారణ సమయంలో ఉక్రెయిన్ నుంచి విమాన ఛార్జీలు ఒక్కో ప్రయాణికుడికి రూ. 30,000 నుంచి రూ. 45,000 వరకు ఉండేవి. ఇప్పడు రూ.లక్షకు చేరిందన్నారు. ఇంటర్నెట్ కట్ కావడంతో ఆందోళన మొదలైందనీ, ఇక రేపటి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయంతో రూం వదిలి ఎక్కడికీ వెళ్లడం లేదని మనాలి తెలిపారు.
తల్లిదండ్రుల్లో ఆందోళన..
ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల యోగక్షేమాలపై వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అక్కడున్న తమ కూతురును సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని హుస్నాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని తగరం మనాలి తల్లిదండ్రులు కవిత, లక్ష్మణ్ విన్నవించారు. అలాగే తమ కొడుకు విశాల్ కిరణ్ శుక్రవారం ఉదయం మాట్లాడారని, తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని అతని తండ్రి తిరుపతి తెలిపారు. అక్కడ కరెంట్ లేకపోవడంతో చీకటి గదుల్లో ఉంటున్నామని తమ కొడుకు చెప్పాడన్నారు. మరో నాలుగు నెలల్లో తన కొడుకు ఎంబీబీఎస్ చదువు పూర్తవుతుందని, ఇంతలోనే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడం బాధగా ఉందన్నారు.