Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ సేవలు
- ఎండీ సజ్జనార్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయాణీకుల సంతృప్తే లక్ష్యంగా టీఎస్ఆర్టీసీ నూతన కార్యచరణతో అడుగు ముందుకెస్తున్నదని ఆ సంస్థ వీసీ, ఎండీ సజ్జనార్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా 30 మంది ప్రయాణీకులు ఉంటే ఇంటికే బస్సు వస్తుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. భక్తులకు సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టామని వివరించారు. 'వ్యయ, ప్రయాసలతో కూడిన ప్రయాణంపై చింత వలదు, టీఎస్ఆర్టీసీ మీ చెంత కలదు'అని తెలిపారు. సంస్థ తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యలు ప్రజారవాణాకు ఊతమిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించే దిశలో ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలు ఆశాజనక ఫలితాలిస్తున్నాయని వివరించారు. ప్రయాణీకుల ఆదరణను మరింత పెంచుకోవడానికి వారు కోరుకుంటే ఇంటి చెంతకే బస్సు సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. '30 మంది ప్రయాణీకులు ఉంటే చాలు కలుగును ప్రయాణంలో ఎంతో మేలు' అనే చందంగా సేవలు అందించేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసిందని పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు, పుణ్యతీర్థాలకు వెళ్లాలనుకునే వారు ఒక బృందం కింద కనీసం 30 మంది ఉంటే ఇంటికి లేదా కాలనీ చెంతకే బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వివరించారు. ఈ సేవలు అవసరమైన వారు సమీపంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ లేదా కాల్ సెంటర్ నెంబర్ 040-30102829, 040-68153333ను సంప్రదించాలని సూచించారు. పర్వదినాలు, జాతర, ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా ఎప్పుడైనా ఆర్టీసీ ఈ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని ఏ ప్రదేశానికైనా, పొరుగు రాష్ట్రాల్లోని ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్లాలనుకునే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.