Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1996 కేంద్ర చట్టం రక్షణ కోసం ఉద్యమం
- తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మార్చి28,29న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భవననిర్మాణ కార్మికులు పాల్గొనాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి ఆర్ కోటంరాజు కోరారు. శనివారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగూరు రాములు అధ్యక్షతన రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల 1996 కేంద్ర చట్టం, 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాల రక్షణ కోసం, నిర్మాణ రంగంలో వాడే ముడి సరుకుల ధరలపై జీఎస్టీని తొలగించాలనే తదితర డిమాండ్ల పరిష్కారం కోసమే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.
వెల్ఫేర్ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న వారికి పని ప్రమాదంలో చనిపోయినా, సహజ మరణం సంభవించినా, పెండ్లి కానుక, ప్రసూతి సదుపాయాలు తదితర అనేక సంక్షేమ పథకాలు వర్తిస్తాయని గుర్తుచేశారు. కానీ..ఆ చట్టాలను, సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం నీరు గారుస్తున్నదని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి ముందే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చిందని తెలిపారు. గుండు గుత్తగా ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం దోచిపెడుతున్నదని విమర్శించారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి రాములు, సీహెచ్ లక్ష్మినారాయణ, డి లక్ష్మయ్య, కె జంగయ్య కార్యదర్శులు ఎల్కా సోమయ్య, పిల్లి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.