Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి తలసాని ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు, పాడి గేదెల పెండింగ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులవత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సబ్సిడీతో గొర్రెలు, పాడి గేదెలను పంపిణీ చేసినట్టు తెలిపారు. అవి ప్రమాదవశాత్తు మరణిస్తే లబ్దిదారులు నష్టపోకుండా ఆదుకునేందుకు ఇన్సురెన్స్ చేశాయని తెలిపారు.
వెదురు సాగు చేయండి : మంత్రి నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో వెదురు సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అందువల్ల రైతులు ఆ పంటను సాగు చేయాలని సూచించారు. వెదురు సాగు వల్ల ఎకరానికి ఏటా లక్ష రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి 'వెదురు సాగు అవకాశాలు - లాభాల' అనే అంశంపై మంత్రి జూమ్ సమావేశంలో మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు మాదిరిగానే వెదురు సాగుకు ఎలాంటి చీడపీడలు, కోతులు, అడవి పందుల బెడద ఉండదన్నారు. విద్యుత్ రంగంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురును విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 5 శాతం వరకు వెదురును వినియోగించాలని కేంద్రం ఆదేశించిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అటవీ ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ వెదురు శాస్త్రవేత్త నంబీ భారతి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో అడవుల నిర్వహణ భేష్
జాతీయ కంపా సీఈవో సుభాష్ చందర్
ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను, నిబంధనల మేరకు వినియోగిస్తూ తెలంగాణ అటవీ శాఖ మంచి ఫలితాలు రాబడుతున్నదని నేషనల్ కంపా సీఈవో సుభాష్ చంద్ర ప్రశంసించారు. ముఖ్యంగా అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటనేది ప్రస్తుత పట్టణీకరణ పరిస్థితుల్లో చాలా ఉపయోగకరమైన కార్యక్రమన్నారు. రెండురోజులుగా హైదరాబాద్‌లో కొనసాగుతున్న అటవీశాఖ జాతీయ సదస్సులో శనివారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు చాలా బాగుందని పేర్కొన్నారు. కంపా నిధులను సక్రమంగా వినియోగించి మంచి ఫలితాలు రాబడున్నారని చెప్పారు. హైదరాబాద్ శివారులో కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌తోపాటు, ఔటర్ రింగ్ రోడ్డు పచ్చదనం, ఎవెన్యూ ప్లాంటేషన్, తదితర అంశాలను పరిశీలించారు. యూపీ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) సంజరు శ్రీవాత్సవ, మణిపూర్ పీసీసీఎఫ్ ఆదిత్య జోషి , తెలంగాణ పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అటవీ అధికారులు జోజి, జానకి రామ్, వెంకటేశ్వర్లు, శంషాబాద్ డివిజనల్ ఆఫీసర్ విజయానంద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.