Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
- ఘనంగా జేఎన్టీయూ స్నాతకోత్సవం
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
జీవితంలో ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ వెనుకడుగు వేయొద్దని, అప్పుడే అనుకున్న లక్ష్యం సాధించగలుగుతామని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శనివారం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జెన్టీయూహెచ్లో పదో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సైన్స్ టెక్నాలజీ కార్యదర్శి డాక్టర్ శ్రీహరి చంద్రశేఖర్‌కు గవర్నర్ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 95 మంది విద్యార్థినీ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. పట్టాలు అందుకున్న వారంతా ఉద్యోగాలు వెతుక్కునే వారు మాత్రమే కాకుండా, ఉద్యోగాలను కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నేడు విద్యార్థుల్లో ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అది సరైంది కాదని, విద్యార్థులెప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. జీవితంలో ఎవరూ పరిపూర్ణవంతులుగా ఉండరని, పొరపాట్లను సరిచేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇది గమనిస్తే మార్గం లభిస్తుందని తెలిపారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం వైపు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ డా. కె.నర్సింహారెడ్డి, డా.గోవర్ధన్ (రెక్టార్), డా. మంజూర్ హుస్సేన్ (రిజిస్ట్రార్) డా.చంద్ర మోహన్ (డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ హైదరాబాద్), వివిధ విభాగాల ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.