Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచినీళ్లు, తిండి లేకుండా ఎట్లా బతకాలే...
- దేవర యంజాల్ బాధితుల ఆవేదన
- న్యాయమైన డిమాండ్‌ను సర్కారు పరిష్కరించాలి
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జి రాములు డిమాండ్
- అండగా ఉంటామన్న పలు పార్టీలు, సంఘాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'రెండేండ్ల నుంచి ఈ భూమి కోసం పోరాడుతున్నాం. మూడు నెలలుగా అందరినీ సమీకరించి కార్యాచరణ రూపొందించాం. ఈనెల మూడున దేవర యంజాల్‌లోని 640, 641 సర్వేనెంబర్ భూమిలో గుడిసెలు వేసుకున్నాం. సుమారు మూడు వేల మంది ఉంటారు. తెల్లారి నాలుగో తారీఖున ఎంఆర్వో వచ్చారు. అక్కడ ఉండొద్దు, ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలన్నాం. అది ఇవ్వకపోగా పోలీసులు దాడులు చేస్తున్నారు. ఏడో తారీఖు నుంచి మంచినీళ్లు బందయ్యాయి. తిండి లేదు. తాగనీకే నీళ్లు, తిననీకే తిండి లేకుండా ఎట్లా బతకాలే. బయటికి వెళ్లే లోపలికి, లోపల ఉన్నోళ్లను బయటికి వెళ్లనివ్వడం లేదు. ఓట్లు అడగడానికి వివిధ పార్టీల నాయకులు వస్తారు. ఇప్పుడెవరు మా గోడు పట్టించుకోవడం లేదు. ఒక్కో రోజు పస్తులుంటున్నాం. శుక్రవారం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నన్ను అరెస్టు చేయొచ్చు. అయినా భయపడేదే లేదు. లాఠీలతో కొట్టినా వెనక్కి తగ్గం. ఆ భూమిలో మాకు ఇండ్ల పట్టాలివ్వాలి. అప్పటిదాకా పోరాడతాం.'అని బాధితురాలు రేణుక ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇండ్లస్థలాల సాధన సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. దేవర యంజాల్ బాధితుల పోరాటానికి అండగా ఉంటామం టూ పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జి రాములు మాట్లాడుతూ ఇది న్యాయమైన డిమాండ్ అనీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. గుడిసెలు వేసుకున్న తర్వాత ప్రభుత్వం స్పందించే వరకూ నిరంతరం పోరాటాలు చేపట్టాలని కోరారు. దాడులు, నిర్బంధాలు ఎదురవుతాయనీ, వాటిని ఎదుర్కొని ఇండ్ల స్థలాలు సాధించేదాకా పోరాడాలని పిలుపునిచ్చారు. అది ప్రభుత్వ భూమి కాబట్టి దాన్ని పేదలకు ఇవ్వకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేదంటే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడతారని అన్నారు. ఆ భూమిని నిలబెట్టుకోవాలనీ, తమ పార్టీ సహకారం ఉంటుందని చెప్పారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ మాట్లాడుతూ అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 640,641 సర్వేనెంబర్‌లోని గుడిసెలకు పట్టాలివ్వాలని కోరారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ గుడిసెలు వేసుకున్నంత సులభంగా ఇండ్లస్థలాలు రాబోవని అన్నారు. పెద్ద పోరాటానికి పూనుకోవాలన్నారు. 58,59 జీవోల ప్రకారం దేవర యంజాల్లో గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ భూమిని బాధితులకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది హేమలలిత మాట్లాడుతూ ఈ సమస్యపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించామని చెప్పారు. ఆ భూమిని రక్షించాలంటూ ఆర్డీవో, దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని అన్నారు. ఎలాంటి వారెంట్ లేకుండానే దేవర యంజాల్లో గుడిసెలు వేసుకున్న వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ఇదేంటనీ పోలీసులను అడిగితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గుడిసెలు వేసుకున్నది ఎవరంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారని అన్నారు. చట్టాలు ప్రజల చేతుల్లో ఉంటేనే న్యాయం దొరుకుతుందన్నారు. వారికి న్యాయం దక్కే వరకూ ఎంతవరకైనా పోరాడతామని చెప్పారు. ఏపీవైఎస్ నాయకులు కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ అబ్బాస్ (సీపీఐఎం), కె హిమబిందు (టీపీఎస్కే), కాసాని శ్రీనివాస్ (జై స్వరాజ్ పార్టీ), ఎస్ఎస్ తన్వీర్ (మైనార్టీ హక్కుల రక్షణ ఫోరం), సనా ఖాన్ (ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ ఫ్రంట్), దేవర యంజాల్ బాధితులు పాల్గొన్నారు.