Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బార్ కౌన్సిల్ విభాగంలో ఒక స్థానానికి ఇద్దరు పోటీ
- ముతవల్లీ కేటగిరిలో రెండు స్థానాలకు ఏడుగురు..
- ఎన్నికల అధికారిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సభ్యుల ఎన్నికలకు రసవత్తర పోటీ నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విభాగాల్లో పోటీ లేకుండా ఇద్దరు సభ్యులు ఏకగ్రీవంగా కాగా, బార్‌కౌన్సిల్ విభాగంలో ఒక స్థానానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. ముతవల్లీ మేనేజింగ్ కమిటీ విభాగంలో రెండు స్థానాలకు ఏడుగురు పోటీ పడుతున్నారు. దీంతో తొలిసారిగా పోలింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా ముతవల్లీ, మేనేజింగ్ కమిటీ విభాగంలో పలువురు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ బాల్కొండ దర్గా హజరత్ సయ్యద్ బందగీ బాద్షా ఖాద్రీ, ముతవల్లీ అబుల్ ఫతా సయ్యద్ బందగీ బాద్షా రియాజ్ ఖాద్రి, దర్గా హజరత్ షా ముతవల్లీ సయ్యద్ అక్బర్ నిజామొద్దీన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాగ్ధాదే శరీఫ్ హజరత్ గౌసే ఆజం షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ వంశీయుడైన రియాజ్ ఖాద్రీ ఉమ్మడి ఏపీలో హజ్ కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారు. సామాజికవేత్తగా అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే ఈయనకు ఉర్దూ, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. సయ్యద్ అక్బర్ నిజామొద్దీన్ పలు పర్యాయాలు వక్ఫ్‌బోర్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. అదేవిధంగా గత పర్యాయం పాలకవర్గ్గంలో మేనేజింగ్ కమిటీ పక్షాన ప్రాతినిధ్యం వహించిన మీర్జా అన్వర్ బేగ్ కూడా ఈసారి పోటీ పడుతున్నారు. మొత్తం 475 మంది ఓటర్లు ఉండగా, ఒక్కో ఓటరు ప్రాధాన్యత క్రమంలో ఇద్దరు సభ్యులను ఎన్నుకోవచ్చు. మరోవైపు బార్ కౌన్సిల్ విభాగంలో ఒక స్థానానికి న్యాయవాదులు ఎంఎం.ముఖీద్, జాకీర్ హుస్సేన్ జావీద్ పోటీ పడుతున్నారు
28న పోలింగ్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్ హజ్ హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ ప్రక్రియ అనంతరం ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల పురస్కరించుకొని హజ్‌హౌస్‌లోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సెలవు ప్రకటించారు. ఈ ఎన్నికలకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు.