Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ పంటను ఎవరు కొంటే.. రైతులదీ వారే కొనాలి
- పరిగి నుంచే యుద్ధభేరీ మోగించాం
- 'మన ఊరు-మన పోరు' సభలో రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
రాబోయే వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని వరి పంటను ఎవరు కొంటే.. రైతులదీ వారే కొనాలని.. లేకపోతే సీఎం కేసీఆర్‌ని నడిరోడ్డుపై ఉరి తీసేందుకు ప్రజలు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ సాకు చూపి సీఎం కేసీఆర్ కుటుంబం కబంధ హస్తాల్లో తెలంగాణ నలిగిపోతోందన్నారు. 'మన ఊరు-మన పోరు'కు పరిగిలో మొదలు పెట్టి, ఇక్కడి నుంచే యుద్ధ భేరీ మోగించాలని పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన 'మన ఊరు-మన పోరు' బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలకు రేవంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొడంగల్ చౌరస్తా నుంచి మినీ స్టేడియం వరకు రోడ్డ్ షో నిర్వహించారు. అనంతరం సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిగి నుంచి కాంగ్రెస్ 'మన ఊరు- మన పోరు' కార్యక్రమం మొదలు పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని తమ కబంధ హస్తాల్లో బంధించారని విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ ప్రాంతం నుంచి మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి, మాణిక్ ప్రభు, మహేందర్ గౌడ్ వంటి ఎంతో గొప్ప నాయకులు వచ్చారని తెలిపారు. కానీ ప్రస్తుతం ఉన్న ఎంపీ రంజిత్‌రెడ్డి గుడ్లు అమ్ముకుంటాడు తప్ప తాగడానికి కనీసం తాగునీరు ఇవ్వడం లేదన్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్కు అమ్ముడు పోయాడని విమర్శించారు. పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి గుడి మాన్యాలనే కాకుండా, గుడిలోని లింగాన్ని కూడా దిగమింగేటోడని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును కొండపోచమ్మలో ముంచి చేవెళ్ల చెల్లెమ్మను టీఆర్ఎస్లో చేర్చుకున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మంత్రిగా ఉండి ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. వికారాబాద్ ఎత్తయిన ప్రదేశం అని కాంగ్రెస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద ప్రాణహిత-చేవెళ్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయాలనుకుంటే.. సీఎం కేసీఆర్ ఇక్కడి ప్రాంత ప్రజల కడుపులు కొట్టి ప్రాజెక్టును తన ప్రాంతానికి తీసుకుపోయారని విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తే పాలమూరు-రంగారెడ్డిని బీడు పెట్టారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లను జగన్ తీసుకుపోతుంటే.. మెగా కృష్ణారెడ్డి నిధులు తీసుకెళ్లాడు, సీఎం కేసీఆర్ కుటుంబం రాజకీయ ఉద్యోగాలు తీసుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతులను వరి వేయొద్దని చెప్పి గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో 150 ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. ఆ వరి పంటను ఎవరు కొంటారో.. రైతులు పండించిన 40 లక్షల ఎకరాల వరి పంటను వారే కొనాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.