Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకటి మద్యం.. రెండోది రిజిస్ట్రేషన్లు
- వీటితోనే బండి లాగిస్తున్న సర్కార్
- భూముల అమ్మకాలపై ఆశలు గల్లంతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంక్షేమం, అభివృద్ధి తమకు రెండు కళ్లంటూ చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం... కేవలం రెండంటే రెండే ఆదాయ వనరుల ద్వారా వాటిని అమలు చేస్తూ వస్తున్నది. వాటిలో ఒకటి మద్యం కాగా, రెండోది రిజిస్ట్రేషన్లు. ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలైన రైతు బంధు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, కేసీఆర్ కిట్ లాంటి వాటికి సింహభాగం నిధులను ఈ రెండే అందిస్తుండటం గమనార్హం. ఇదే సమయంలో ప్రతీయేటా చెబుతూ వస్తున్న భూముల అమ్మకాలపై ఆశలు గల్లంతవుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంటున్నది. మద్యం అమ్మకాల ద్వారా ప్రతీయేటా సర్కారు సుమారు రూ.35 వేల కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రూపంలో మొత్తం రూ.34 వేల కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నది. ఇందులో అడ్డపన్ను (షాపుల నిర్వహణ) రూ.17 వేల కోట్లు, మద్యంపై పన్ను రూ.17 వేల కోట్ల మేర అంచనాలేసింది. ఇందులో గత డిసెంబరు నాటికి 76.71 శాతం ఖజానాకు చేరింది. మరోవైపు రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా రూ.12,500 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందులో డిసెంబరు నాటికి రూ.8,288 కోట్ల ఆదాయం (మొత్తం అంచనాల్లో 66.31 శాతం) వచ్చింది. ప్రస్తుతం మనం ఫిబ్రవరి చివరిలో ఉన్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ముగియటానికి ఇంకో నెల సమయముంది. ఆలోపు మద్యం, రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం తాను వేసుకున్న అంచనాలను దాదాపు చేరుకుంటుందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. భూముల అమ్మకాలపై ప్రభుత్వం వేసుకున్న అంచనాలు మాత్రం చేరుకోవటం లేదు. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ బూమ్ మాత్రం విపరీతంగా పెరిగింది. సర్కారు భూములకు సంబంధించి ప్రతీది పారదర్శకంగా చేయాల్సి రావటం, పన్నులన్నీ సక్రమంగా చెల్లించాల్సి రావటమనేది కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా మారిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన ప్లాట్లను కొనుగోలు చేయాలంటే మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని వారు అభిప్రాయపడ్డారు. ఆయా ప్లాట్లను కొనుగోలు చేసేటప్పుడు ఒక శాతం వైట్ మనీని చెల్లించి, మిగతా మూడు శాతాలను బ్లాక్ మనీని చెల్లిస్తున్నారన్నది వారి విశ్లేషణ. ఈ కారణంతోనే ప్రభుత్వ భూముల అమ్మకాలనేవి వెనుకపట్టు పడుతున్నాయనీ, రియల్ ఎస్టేట్ మాత్రం శరవేగంగా ఊపందుకుంటున్నదని అధికారవర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే ప్రభుత్వ భూముల్ని అమ్మితే... భావి తరాలకు తీవ్ర నష్టం కలుగుతుందనీ, భవిష్యత్ అవసరాల రీత్యా వాటిని అమ్మకుండా ఉండాలని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.