Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గర్భిణులను వేడుకుంటున్న ఏఎన్ఎంలు
- మూడు నెలల్లోపు గుర్తిస్తేనే కేసీఆర్ కిట్
- టార్గెట్ పేరుతో వేధిస్తున్న అధికారులు
- ఖమ్మం జిల్లాలో 72 మందికి మెమోలు, ఇద్దరిపై వేటు
- సహజ ప్రసవాల విషయంలోనూ నర్సులే బాధితులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'ప్లీజ్.. చెప్పండి..!' అంటూ గర్భిణులను వేడుకుంటున్నారు ఏఎన్ఎంలు. సకాలంలో గర్భిణులను గుర్తించి కేసీఆర్ పోర్టల్‌లో నమోదు చేయడం నర్సులకు తలకు మించిన భారంగా మారింది. తమ పీహెచ్సీ పరిధిలోని గర్భిణీ మహిళలను మూడు నెలల్లోపు అంటే 12వారాల్లోగా గుర్తించాలి. ఈ సమయంలోగా గుర్తించకపోతే సంబంధిత స్త్రీలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పొందినా కేసీఆర్ కిట్‌కు అనర్హులుగా పరిగణిస్తారు. 12 వారాలకు మించి ఒకరోజు ఆలస్యమైనా ఆన్లైన్ నమోదు సాధ్యం కాదు.
కానీ కొందరు గర్భవిచ్ఛితిపై అనుమానంతో 12 వారాల వరకు బయటకు వెల్లడించేందుకు సంకోచిస్తున్నారు. ఈ కారణంగా సకాలంలో గర్భిణులను గుర్తించడం ఏఎన్ఎంలకు ఇబ్బందిగా పరిణమించింది. అటు వ్యాక్సినేషన్, కరోనా టెస్టులు, గర్భిణుల ఫాలోఅప్, కేసీఆర్ కిట్ వివరాలు ఆన్లైన్లో నమోదు, వైద్యపరంగా ఇతరత్రా విధులు కూడా ఏఎన్ఎంలే నిర్వర్తించాల్సి రావడంతో పనిభారంతో సతమతమవుతున్నారు. అధికారులేమో టార్గెట్ పేరుతో వెంటపడుతున్నారు.
సహజ ప్రసవాల పేరుతో మరో చిక్కు
సహజ ప్రసవాల పేరుతో ఏఎన్ఎంలకు మరో చిక్కు వచ్చిపడింది. సాధారణ ప్రసవాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఈ విషయంపై హుకుం జారీ చేశారు. నాటి నుంచి కలెక్టర్ సహా ఇతర అధికారులు దీనిపై దృష్టి సారించారు. గర్భిణులను గుర్తించి సహజ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించడం, గర్భిణుల పేర్లను రిజిస్టర్ చేయడం, వారికి యాంటీ నాటల్ పరీక్షలు (ఏఎన్సీ) చేయించడం, ప్రసవం అయ్యే వరకు పర్యవేక్షించడం ఏఎన్ఎంల విధి. ఖమ్మం జిల్లాలో 372 మంది ఏఎన్ఎంలు ఉండగా.. ఈ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని 72 మందికి మెమోలు జారీ చేశారు. ఇద్దరు కోఆర్డినేటర్లనూ సస్పెండ్ చేశారు. ఖమ్మంలోని వెంకటేశ్వరానగర్, శ్రీనివాసనగర్ పీహెచ్‌సీల పరిధిలో పనిచేసే ఈ ఇద్దరు కోఆర్డినేటర్లు ఏఎన్సీ నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ శనివారం నిర్వహిస్తున్న రివ్యూ మీటింగ్‌లో ప్రస్తావించారు.
రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఖమ్మంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న పలువురికి ఇక్కడి ఆధార్‌కార్డులు లేవు. తద్వారా కేసీఆర్ పోర్టల్‌లో ఆధార్, బ్యాంక్ ఖాతానంబర్, ఫొటో వివరాలు ఆన్లైన్ కాలేదు. ఇదే విషయాన్ని పేర్కొనడంతో వీరిపై వేటు వేశారు. ఖమ్మం జిల్లాలో శనివారం వస్తుందంటే రివ్యూమీటింగ్ భయం పట్టుకుంటోంది.
ప్రభుత్వ వైఫల్యానికి ఏఎన్ఎంలు బాధ్యులా...?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసౌకర్యాలపై నమ్మకం కలిగించడంలో సర్కారు వైఫల్యం చెందింది. తెలంగాణలో ఏటా ఆరు లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 15వేల వరకు ప్రసవాలు అవుతుండగా, ప్రయివేట్ ఆస్పత్రుల్లో 8 వేల మంది వరకు డెలివరీ అవుతున్నారు. ఏఎన్ఎంలు, అంగన్వాడీలు గర్భిణులకు అవగాహన కల్పించి 102 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి పంపుతున్నారు. కొన్నిచోట్ల వైద్య సిబ్బంది సరిగా స్పందించక దూరప్రాంతాలకు రిఫర్ చేస్తుండటంతో గర్భిణులు ప్రయివేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. పైగా అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో గైనకాలజిస్టులు ఉండటం లేదు. జిల్లాలో 30 పీహెచ్‌సీలు ఉండగా, వీటిలో రౌండ్ దీ క్లాక్ హాస్పిటల్స్ పదింటిలో మాత్రమే డెలివరీలు చేస్తున్నారు. వీటిలో అనేక చోట్ల గైనకాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న డాక్టర్లలోనూ పలువురు ప్రయివేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో గంటల తరబడి వేచివుండి సహజ ప్రసవాలు చేసేందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణ ఉంది. నార్మల్ డెలివరీకి ఒక్కోసారి పది నుంచి 18 గంటల వరకు వేచివుండాల్సి రావడంతో అటు డాక్టర్లు, ఇటు పేషెంట్ తరఫువారు సహజ ప్రసవాలకు అంతగా మొగ్గుచూపడం లేదు. 2020-21లో రాష్ట్రవ్యాప్తంగా 6,35,041 మంది గర్భిణులు కేసీఆర్ కిట్‌లో రిజిస్టర్ అయ్యారు. వీరిలో నాలుగో ఏఎన్సీ నాటికి 4,29,028 మంది మాత్రమే చెకప్ చేయించుకున్నారు. 2021-22లో 5,20,200 మందికిగాను చివరి ఏఎన్సీ నాటికి 3,60,075 మందే మిగిలారు. వీరిలో 2,48,449 మంది మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారు. అయితే కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టక ముందు 35శాతం లోపు ప్రసవాలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేవి. ప్రస్తుతం 54.5శాతం ప్రసవాలు సర్కారు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ పోర్టల్‌లో నమోదై ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయితే మగపిల్లాడు పుడితే రూ.12వేలు, ఆడపిల్లైతే రూ.13వేలు పారితోషికంగా ఇస్తుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల వైపు గర్భిణులు మొగ్గుచూపుతున్నారు. అయితే వీరిలోనూ 50శాతానికి పైగా సిజేరియన్ అవుతుండటం ఆందోళన కలిగించే అంశం. వీటన్నింటికీ ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలను బాధ్యులను చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ఏఎన్ఎంలను బాధ్యులను చేయడం సరికాదు
కళ్యాణం వెంకటేశ్వరరావు- సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యదర్శి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించి సర్కారు దవాఖానలపై నమ్మకం కలిగించాలి. అంతేకానీ క్షేత్రస్థాయి ఏఎన్ఎంలను దీనికి బాధ్యులను చేసి మెమోలు ఇవ్వడం సరికాదు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం వల్లే గర్భిణులు రావడం లేదు. ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు పోస్టులు భర్తీ చేసి, సౌకర్యాలు మెరుగుపరిచాలి కానీ ఏఎన్ఎంలపై చర్యలు తీసుకుంటే ఉపయోగం లేదు.