Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిరక్షణను పట్టించుకోని కేంద్రం
- కాళేశ్వరంతో సజీవంగా గోదావరి :మంత్రి నిరంజన్‌రెడ్డి
- అన్ని భాషల్లో రివర్ మ్యానిఫెస్టో: రాజేంద్రసింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది సజీవంగా ఉన్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోగల విశ్వేశ్వరయ్య భవన్లో ప్రారంభమైన నదుల పరిరక్షణా జాతీయ స్థాయి సదస్సు లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, జలవనరుల అభివద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ సదస్సుకు శ్రీకారం చుట్టారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నదులు ఉన్న చోటనే నాగరికత వెలిసిందనీ, ఈ రెండింటికి మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. నదులను ప్రస్తుతం ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వ్యర్థాలతో నిండిపోతున్నాయనీ, నదుల సంరక్షణ లేక కలుషితం అవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నదుల పరిరక్షణ, సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం నదులను సజీవం చేసిందనీ, ఇందుకు సాక్ష్యం గోదావరి నది అని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నదులు కలుషితం కాకుండా చర్యలు చేపడుతున్నదనీ, గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతున్నదన్నారు. గ్రామాల్లో పచ్చదనం కోసం స్థానికంగానే నర్సరీలను ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా గ్రామానికో నర్సరీ ట్రాక్టర్, వాటర్ ట్యాంకులు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన నీటిపారుదల ప్రాజెక్టు అనీ, దీన్ని కేవలం మూడేండ్ల రికార్డు సమయంలో నిర్మాణం చేపట్టామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో వలసలు తగ్గాయనీ, పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పండిస్తున్న పంటలు ఎక్కువ కావడంతో కేంద్రం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసిందన్నారు. నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు, ఎన్జీవోలు, ఇతర సంస్థలు సైతం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈబృహత్తర కార్యక్రమంలో వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్, జలవనరుల సంస్థ చైర్మెన్ వి. ప్రకాశరావు, రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు.
మానవాళి నడవడిక బాగుండాలి:రాజేంద్రసింగ్
నదులు ఆరోగ్యంగా ఉంటే మానవాళికి మంచి జరుగుతుందని వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్ అన్నారు. నదుల విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. వాటిని నాలాలుగా మార్చొద్దని హితవు పలికారు. భవిష్యత్తరాలు క్షేమంగా ఉండాలంటే అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. వ్యర్థాలు, కాలుష్యంతో నదులు మృతనదులుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదుల మ్యానిఫెస్టో ద్వారా ప్రజలు, ప్రభుత్వాలకు మంచి ప్రణాళికను అన్నీ భాషల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రారంభోత్సవంలో భాగంగా సుజల భారతి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశరావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఈ సదస్సును నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వందన సమర్పణ చేశారు. తొలిరోజు నదుల సంరక్షణపై పలువురు ప్రముఖులు, ఆహ్వానితులు తమ అభిప్రాయాలను ఆయా సెమినార్లల్లో పంచుకున్నారు. అతిథులకు మంత్రి నిరంజన్‌రెడ్డి జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. ఆదివారం కూడా ఈ సదస్సు కొనసాగనుంది.