Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మన ఊరు-మన బడి' నిధుల సద్వినియోగానికి చర్చించాలి
- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి
- నేడు, రేపు యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు
నవతెలంగాణ - కందనూలు
విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని దేవకి ఫంక్షన్ హాల్లో శనివారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఆది, సోమవారం నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సులను జయప్రదం చేయాలన్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆంగ్ల మాద్యమం, మన ఊరు-మన బడి, మన బస్తి వంటి కార్యక్రమాలను స్వాగతిస్తున్నామన్నారు. 'మన ఊరు-మన బడి' నినాదాలకే పరిమితం కాకుండా కేటాయించిన రూ.7,289 కోట్లు సద్వినియోగమయ్యేటట్టు ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగ నిపుణులతో చర్చించి కార్యాచరణ రూపొందించాలన్నారు. అదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, ఉపాధ్యాయ, పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేసి వాటి పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, న్యాయశాస్త్ర ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ముఖ్య వక్తలుగా వ్యవహరిస్తారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎ.వెంకట్, వి.శాంత కుమారి, ఆర్.శారద, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వహీద్ ఖాన్, ఎం.శ్రీధర్ శర్మ, ఉపాధ్యక్షులు ఎం.రమాదేవి, జిల్లా కార్యదర్శులు పి.మహేశ్ బాబు, ఎన్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.