Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్లో ఘటన
- మహిళ మృతి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
చెత్తకుప్పలో చెత్తను సేకరిస్తుండగా భారీ పేలుడు సంభవించడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన రంగముని, సుశీలమ్మ(40) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఐదేండ్ల కిందట బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి కర్మాన్ఘాట్లోని సందనవనంలో నివాసముంటున్నారు. భార్యభర్తలిద్దరూ చెత్తను సేకరించి అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివారం భార్యభర్తలిద్దరూ మైలార్ దేవరపల్లి డివిజన్లోని ఆనంద్నగర్లో భార్య ఒక ప్రాంతంలో, భర్త మరో ప్రాంతంలో ఇద్దరూ చెత్తను సేకరిస్తున్నారు. అయితే భార్య సుశీలమ్మ ఒక రాళ్ల కుప్పలదగ్గర చెత్తను తీస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆమె ఘటనా స్థలంలోనే మృతిచెందింది. పేలుడును గుర్తించిన ఆమె భర్త వచ్చి చూసే సరికి అమె అవయవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దాంతో ఆయన కన్నీరుమున్నీరుగా విలపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్, సీఐ నరసింహ చేరుకొని పేలుడుకు గల కారణాల గురించి విచారణ చేపట్టారు. బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్లను రంగంలోకి దించి పలు నమూనాలను సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.