Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు వ్యతిరేక వ్యవసాయ సంస్కరణలను వేగవంత చేసేందుకు బీజేపీ కేంద్ర సర్కారు ప్రయత్నం చేస్తున్నదని అఖిల భారత కిసాన్ సభ(ఏఐకెఎస్) జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి జంగారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ డంకెల్ చెప్పిన విధానాలు దేశంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా వ్యవసాయ సబ్సిడీలు క్రమంగా తగ్గించారని తెలిపారు. బహుళ జాతి సంస్థలు తమ విత్తనాలను భారతదేశంలో అమ్ముకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. మోన్్శాంటో, డూ-పాయింట్, కార్గిల్, సిన్జెంటా వంటి కంపెనీలు 80 శాతం విత్తన రంగాన్ని ఆక్రమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని కోరారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ ప్రస్తుత సంస్కరణలకు ప్రత్యామ్నాయంగా భూమిపై హక్కులు కల్పించడంతోపాటు, భూసార పరీక్షలు జరిపి తగిన విత్తనాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. చిన్న తరహా యంత్రాలను రాయితీపై రైతులకు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, అరిబండి ప్రసాదరావు, పోతినేని సుదర్శన్రావు తదితరులు పాల్గొన్నారు.