Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు యంత్రాలతో రైతులపై భారం
- అందుబాటులోలేని పనిముట్లు
- సబ్సిడీలు ఎత్తేసి రైతు బంధుసేవలో సర్కారు
- సాగు పద్దతుల్లో మార్పులు
- సూక్ష్మసేద్యానికి నిధులేవు
- బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న రైతాంగం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రానున్న బడ్జెట్‌పై అన్నదాతలు గంపెడాశలు పెట్టుకున్నారు. సాగుకు సహకరించే యంత్రాలు, పనిముట్లకు నిధులొస్తాయని భావిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రెండేండ్లు మినహా (2018-19 రూ 63 కోట్లు, 2019-20 రూ 30.43 కోట్లు) మిగతా సంవత్సరాల్లో యంత్రీకరణ కోసం బడ్జెట్లో నిధులు కేటాయింపులు జీరో. బడ్జెట్లో చూపిన నిధులు కూడా ఖర్చు చేయలేదు. కాబట్టి వచ్చే బడ్జెట్లో యంత్రీకరణకు నిధులు కేటాయిస్తే, సబ్సిడీ రూపంలో చిన్నచిన్న పనిముట్లు కొనుగోలు చేయొచ్చు అనే భావనలో రైతులు ఉన్నారు. పంటల్లో వస్తున్న మార్పులు, సాగు పద్దతుల్లో నెలకొన్న పరిస్థితులను తట్టుకోవాలంటే, వ్యవసాయంలో తప్పనిసరిగా యంత్రాల వాడకం కీలకంగా మారింది. రైతు శ్రమను తగ్గించడంతోపాటు అధిక దిగుబడి పెంచాల్సి వున్నది. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ కూడా ఇవి ఎంతో ఉపకరిస్తాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యంత్రీకరణపై దృష్టి సారించటంలేదు.వ్యవసాయ శాఖలో ఉన్న మెకనైజేషన్ విభాగానికి నిధుల్లేక వారంత ఇతరత్రా పనుల్లో నిమగమవుతున్నారు.
అన్నదాతకు కష్టాలే...
వ్యవసాయం చేయడానికే రైతు జంకుతున్నారు. ప్రకృతివైపరీత్యాలు అన్నదాతలను వెంటాడుతున్నాయి. ఎరువులు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. పండిన పంటకు మద్దతు ధర అందదు. ఒకవైపు కూలీల కొరత వెంటాడుతున్నది. మరోవైపు యంత్రాలతో సాగు చేయాలంటే, వాటి అద్దె తడిసిమోపడవుతున్నది. వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్న భారీ యంత్రాలు ప్రయివేటు సంస్థలే రూపొందిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ వరకు ఒక యంత్రాన్ని కూడా కనుగోలేదు. యూనిర్సిటీ పరిశోధనలను ప్రోత్సహించడంలోనూ ప్రభుత్వం వైఫల్యమైంది. సాగులో పెద్ద పెద్ద యంత్రాలు ఎంత ముఖ్యమో, చిన్న, చిన్న పని ముట్టు అంతే అవసరం. సన్న, చిన్నకారు రైతులకు పెద్ద యంత్రాలతో పనిలేదు. కానీ చిన్న పనిముట్లు చాలా అవసరమవుతాయి. వాటికి కూడా ప్రభుత్వం సబ్సిడీలో ఇవ్వడం లేదు. ట్రాక్టర్ల కిరాయి కూడా బాగా పెరిగిపోయింది. రైతు బంధు ఇస్తున్నామనే పేరుతో ఇతర సబ్సిడీలను ఎత్తేసింది. దీంతో రైతులు అప్పులు చేసి ప్రయివేటులో కొనుగోలు చేయాల్సి వస్తున్నది.
రైతులే మారుతున్నారు
యంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో రైతులు విసిగిపోతున్నారు. ప్రభుత్వం మారకపోయినా, రైతులు మారుతున్నారు. వరినాటే యంత్రాల అద్దెలు పెరిగిపోవడంతో వరి విత్తనాలు వెదజల్లే పరిస్థితులు వస్తున్నాయి. నారుమాడులు నుంచి వరి కోసి, తూర్పార పట్టే వరకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని ప్రభుత్వం సమకూర్చడంలేదు. వరిసాగులో యంత్రాలు రావడంతో ఆ పంట సాగువైెపే రైతులు మొగ్గు చూపుతున్నారు. మిగతా పంటల్లో యంత్రీకరణ రాకపోవడంతో వాటిపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ శ్రమతో కూడిన వేరుశనగ, పెసర్లు, మినుము పంటల్లో యంత్రాలు లేకపోవడంతో అవి కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రోత్సహమూ లేదు...పరిశోధóనలు లేవు
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంట దిగుబడి సాధించడానికి యంత్రీకరణ ముఖ్యమైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం లేదు. పరిశోధనలకు కూడా సరైన నిధులు కేటాయించడం లేదు. అన్ని చోట్ల పెద్ద యంత్రాలే పని చేయవు. కూరగాయలు, పండ్ల తోటలకు చిన్న, చిన్న యంత్రాలు మేలు చేస్తాయి. సన్న, చిన్నకారు రైతులకు ఉపయుక్తంగా ఉంటాయి. కూరగాయల సాగుకు సూక్ష్మసేద్యం(డ్రిప్‌ఇరిగేషన్) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వేలాది మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకూ, పలుకూలేదు.
యంత్రీకరణతోనే దిగుబడి పెరుగుతున్నది
ఎల్ జలపతిరావు వ్యవసాయ శాస్త్రవేత్త
సాగును పూర్తిగా అధునీకరించాలి. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు ఉపయోపడే పనిముట్లను సబ్సిడీకి అందించాలి. అర ఎకరా, ఎకరా, రెండెకరాలు ఉన్న రైతును దృష్టిలో పెట్టుకుని పనిముట్లను అందించాల్సి ఉన్నది. కలుపు తీయడానికి, పత్తి ఏరడానికి కూడా యంత్రాలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించడం లేదు. ట్రాక్టర్లు వచ్చిన తర్వాత దున్నడం సులువైంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయిల్‌పామ్ సాగుకు మాత్రమే డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నది. మిగిలిన పంటలను ప్రోత్సహించాలి. అప్పుడే రైతుకు కొంత ఆదాయం పెరుగుతుంది. దిగుబడిలోనూ మార్పు వస్తున్నది.