Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుద్ఘాతంతో 10 గుడిసెలు దగ్ధం
- రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం
నవతెలంగాణ-నారాయణఖేడ్
పొట్టకూటి కోసం పిల్లాపాపలతో కలిసి వలస వచ్చి.. గ్రామానికి సమీపంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. పనుల్లో భాగంగా యథావిథిగా కుటుంబ పెద్దలంతా పనులకు వెళ్లారు. ఇంతలో ఒక్కసారిగా ఓ గుడిసెలో విద్యుద్ఘాతం జరిగి మంటలు చెలరేగి క్షణాల్లో మిగతా గుడిసెలకూ వ్యాపించాయి. మంటలు మాత్రం అదుపులోకి రాకపోవడంతో పది గుడిసెలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం తోర్నాల గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగిలిగిద్ద మండలంలోని ఇరాక్‌పల్లి శ్యామనాయక్ తాండాకు చెందిన ఓ పది కుటుంబాలు.. చెరకు నరకడం కోసం తోర్నాల గ్రామానికి వలస వచ్చాయి. అయితే రోజులాగానే ఆదివారం ఉదయం చెరకు నరకడానికి ఆ కుటుంబాల్లోని పెద్దలంతా వెళ్లారు. చిన్నపిల్లలు ఆ గుడిసెల వద్దే ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ గుడిసెలో విద్యుద్ఘాతం జరిగి మంటలు చెలరేగాయి. పిల్లలందరూ భయంతో అరుస్తూ బయటికి పరుగులు తీశారు. మంటలు తీవ్రమై మిగతా గుడిసెలకూ అంటుకున్నాయి. ఇంతలో ఓ మూడు గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. గ్రామస్తులు గమనించి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మిగతా గుడిసెల్లోని ఏడు సిలిండర్లు బయటికి తీశారు. మంటలు మాత్రం అదుపులోకి రాకపోవడంతో పది గడిసెలు దగ్ధమయ్యాయి. కాగా ఈ మంటల్లో రూ.2 లక్షల నగదు, రెండు బైక్‌లతో పాటు తమ సామగ్రి మొత్తం కాలి బూడిదయ్యిందని బాధితులు వాపోతున్నారు. సుమారు రూ.10లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని కన్నీరుమున్నీరవుతున్నారు. పొట్ట కూటి కోసం వస్తే.. కడుపు కోత మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఘటన స్థలాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసులు పరిశీలించి పంచనామా నిర్వహించారు. ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం వచ్చేలా కృషి చేస్తామన్నారు.
కాగా, వలస కార్మికుల నిత్యావసర సరుకులతో పాటు వారి బట్టలు పూర్తిగా కాలి బూడిదవ్వడంతో వారి బతుకులు రోడ్డున పడ్డాయని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోటారి నర్సింలు, లంబాడి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కిషన్ రాథోడ్ వాపోయారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు సేవోద్గం ఫౌండేషన్ అండ్ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 క్వింటాల బియ్యంతో పాటు రూ.10 వేల విలువ గల నిత్యావసర వస్తువులు, 20 దుప్పట్లు పంపిణీ చేశారు. వారికి బాధితులు, గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.