Authorization
Sat March 22, 2025 10:12:25 am
- రాష్ట్ర తలసరి ఆదాయం రెండింతలు: మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నదుల పరిరక్షణ, పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్గల విశ్వేశ్వరయ్యభవన్‌లో ఆదివారం నదులపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ కాకతీయతో పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి.. ఆయకట్టు పెంచుకున్నామనీ, అలా రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించుకున్నామన్నారు. దీంతో భారీ వర్షాలు పడినా చెరువు కట్టలు తెగిపోలేదనీ, భూగర్భ జలాలు పెరిగాయని అభిప్రాయపడ్డారు. నాలుగు వేల చెక్‌డ్యామ్‌లను రూ.ఆరు వేల కోట్లతో నిర్మించుకున్నామని వివరించారు. తద్వారా భూగర్భజలాలు పెరిగి, సంవత్సరం అంతా చెరువులను వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదని సీఎం కేసీఆర్ నిరూపించారని చెప్పారు. 141 టీఎంసీల రిజర్వాయర్లను గోదావరి నదిపై నిర్మించుకున్నామనీ, భవిష్యత్ తరాల కోసం నదులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చాలా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలియజేశారు.
రాష్ట్ర తలసరి ఆదాయం రెండింతలు
2014 నుంచి తలసరి ఆదాయం రూ.1,24,104 ఉంటే.. 2021 తలసరి ఆదాయం రూ.2,78,933కు పెరిగిందని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం రెండింతల వద్ధి నమోదైందని చెప్పారు. 2014లో జీడీపీ రూ.5,500 ఉండగా.. 2021లో జీడీపీ రూ.11,54,000 పెరిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందనీ, ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉందన్నారు. మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామనీ, ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీలెవల్ సాగునీటి ప్రాజెక్టు అని తెలిపారు. మూసీ పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారనీ, కొద్ది రోజుల్లోనే వాటి పనులు మొదలుపెడతారన్నారు. ఆ పనులు పూర్తయ్యాక మూసీ నదిపై వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాక్షించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదనీ, ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ తాగునీరు కూడా అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనుషుల స్వార్థం వల్లే ప్రకృతి నాశనం : మంత్రి జగదీశ్ రెడ్డి
నదులను నాశనం చేసేది మన మానవ జాతేనని, మనుషుల స్వార్థం వల్లే ప్రకృతి నాశనం అవుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నదుల సంరక్షణకు పాటు పడుతున్నారని గుర్తు చేశారు. ఇవాళ ఎక్కడ చూసినా నీళ్ల గురించే మాట్లాడుతున్నాం. నీళ్లను వస్తువుగా, నీళ్లను సెంటిమెంట్‌గా చూస్తున్నాం. నీళ్లే ప్రాణం. నీళ్లు లేనిదే ప్రాణి లేదని వ్యాఖ్యానించారు. మూసీ నది ఒడ్డున మనం ఉన్నాం కానీ, మూసీ నది ఆనవాళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మురుగు నీరు తాగిన ఏకైక పట్టణం సూర్యాపేట. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమంతో మాకు ఆ బాధలు పోయాయన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందనీ, నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తో ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందిస్తున్నామన్నారు. సీఎం కషితో వలసలు ఆగిపోయాయనీ, అన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కటే మాట చెప్పారు. వానలు వాపసు రావాలి. కోతులు అడవులకు పోవాలి. ఈ వానలు వాపసు తెచ్చుకోవాలి అంటే చెట్లను పెంచుకోవాలి. రాష్ట్రంలో ఏ రహదారిలో పోయిన పచ్చని చెట్లు ఇరువైపులా కనిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల సంస్థ అధ్యక్షులు వి. ప్రకాశరావు, రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నాయకులు రమణానాయక్, రమ , గోపాలరావు, శంకర్‌ప్రసాద్ పాల్గొన్నారు.
హైదరాబాద్ డిక్లరేషన్
నదులను ఆక్రమణలు, కాలుష్యం, ఇసుక, నీటి దొంగతనం నుంచి కాపాడాలంటూ నదులపై జాతీయ సదస్సు ముగింపులో ఒక డిక్లరేషన్ రూపొందించారు. ఈమేరకు వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వి. ప్రకాశరావు, ఇండియన్ హిమాలయన్ రివర్ బేసీన్ చైర్మెన్ ఇందిరా ఖురానా, వాటర్ ఫైటర్స్ బొలిశెట్టి సత్యనారాయణ, వినోద్ బోదంకర్, రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి డిక్లరేషన్ విడుదల చేశారు. రాష్ట్ర జలవనరుల సంస్థ ఆద్వర్యంలో పలు స్వచ్చంధ సంస్థలు, వ్యక్తులకు వాటర్ అవార్డులను అందజేశారు.