Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా శాసిస్తున్న నాటో కూటమి రద్దు చేయాలి
- సమాజంలో ప్రజలకు దగ్గరగా ఉండేది ఉపాధ్యాయులే
- కుల, మత రహిత సమాజం కోసం పనిచేయాలి :టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలోఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
శాస్త్ర విజ్ఞానం సర్వత్రా ఆచరణీయంగా ఉండాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడారు. సమాజంలో ప్రజలకు ఉపాధ్యాయులే అతి దగ్గరగా ఉంటారని తెలిపారు. శాంతియూతంగా ఉండాల్సిన ప్రపంచ దేశాలు యుద్ధ బాట పట్టడం విచారకరమన్నారు. అమెరికా వంటి దేశాలు నాటో వంటి యుద్ధ కూటమిని ప్రోత్సహిస్తూ యుద్ధాలకు ప్రేరణ కలిగే విధంగా వ్యవహరించడం వల్లే నేడు రష్యా, ఉక్రెయిన్ దేశాలు తలపడుతున్నాయని గుర్తు చేశారు. యుద్ధాలతో ఇరుదేశాలే కాకుండా ప్రపంచ దేశాలపై దాని ప్రభావం పడుతుందన్నారు. ఏడేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి ఖర్చు పెట్టాల్సిన నిధులను భారీగా తగ్గిస్తుందని ఆరోపించారు. బతుకుదెరువు లేని కాలం నుంచి బతుకులు చక్కదిద్దే వరకు వచ్చామన్నారు. అనేక ఉద్యమాలు చేసి హక్కులను సాధించుకున్న టీఎస్ యూటీఎఫ్ మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు. సామాజిక ఉద్యమాలకు ప్రతీకగా నిలిచిన టీఎస్ యూటీఎఫ్ కుల, మత రహిత సమాజం కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 'మన ఊరు - మన బడి' అనే విధానాన్ని తీసుకువచ్చి పాఠశాలల్లో మౌలిక వసతులకు శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయివేటు స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తే బడుగు, బలహీన వర్గాల కల నెరవేరుతోందన్నారు. గతంలో వచ్చిన పథకాల మాదిరిగా కాకుండా 'మన ఊరు మన బడి' విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం పేదవారిని విద్యకు దూరం చేసే చర్యలు అమలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం బడ్జెట్లో 10శాతం నిధులు విద్యకు కేటాయించాలని ఆదేశిస్తే కేవలం రెండు శాతానికి పరిమితం చేశారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై అధిక నిధులు కేటాయించి కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్రావు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, సీనియర్ ఉపాధ్యాయులు అబ్దుల్లా ఖాన్ వహీద్ ఖాన్, ఏపీ మల్లయ్య, కిష్టయ్య, సత్యనారాయణ లక్ష్మయ్య, సంయుక్త, దుర్గా భవాని, రవీందర్ గౌడ్, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.