Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాయిలెట్లు సహా మౌలిక వసతులు కరువు
- నీటి సౌకర్యం లేక విద్యార్థుల అవస్థ
- నిర్వహణ సరిగ్గా లేక దుర్వాసన
- పై పెచ్చులూడుతున్న తరగతి గదులు
- పట్టించుకోని అధికారులు
- 'మన ఊరు-మనబడి' కోసం ఎదురుచూపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సర్కారు బడులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస మౌలిక వసతుల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల్లేక విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. ఇక అమ్మాయిలు ఇంటినుంచి వచ్చేటపుడే నీళ్లు తాగకుండా వచ్చే దుస్థితి ఉన్నది. ఎందుకంటే నీళ్లు తాగి వస్తే మూత్రవిసర్జనకు అవకాశం లేకపోవడంతో ఈ పని చేస్తున్నారు. ఎదిగే ఆడపిల్లలు కావడంతో వారికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నా నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా ఉన్నాయి. టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో దుర్వాసన వస్తున్నది. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదకర పరిస్థితులున్నాయి. ప్రభుత్వం పారిశుధ్య కార్మికులను నియమించలేదు. మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీ కార్మికుల సేవలను వినియోగించుకోవాలని చెప్తున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చెత్తాచెదారం పేరుకుపోతున్నది. ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలు చాలా ఉన్నాయి. ప్రహరీగోడ లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాగునీటి మరికొన్ని పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పై పెచ్చులూడి కింద పడుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే ఈ పరిస్థితి ఉండడం గమనార్హం. ముషీరాబాద్‌లో ప్రభుత్వ పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. పెచ్చులూడి కింద పడుతుండడతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయం...భయంగా స్కూళ్లకు వస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జమిస్తాన్‌పూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహణ సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తాచెదారం ఉన్న ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనం తింటున్నారు. ఒకే తరగతి గదిలో మూడు తరగతుల విద్యార్థులుంటున్నారు. డోర్లు లేకుండా మరుగుదొడ్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోనే ఇలాంటి దుస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అక్కడ అలా...
కేరళ, ఢిల్లీలో అంతర్జాతీయ ప్రమాణాలతో సర్కారు స్కూళ్లు
తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేండ్లు కావస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగానికి అన్యాయం జరిగిందంటూ ఉద్యమ సమయంలో నేటి పాలకులు ఊదరగొట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సైతం ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికి నోచుకోలేదు. విద్యారంగ అభివృద్ధిపై సర్కారు ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. దీంతో సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కానీ కేరళ, ఢిల్లీలో అంతర్జాతీయ ప్రమాణాలతో సర్కారు బడులు కళకళలాడుతున్నాయి. మౌలిక వసతుల కల్పనలో దేశానికే ఆదర్శంగా ఆయా రాష్ట్రాలు నిలుస్తున్నాయి. విద్యార్థుల ప్రవేశాలు, హాజరు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. డిజిటల్ తరగతి గదులున్నాయి. విద్యార్థులకు డిజిటల్ విద్య అందుతున్నది. తెలంగాణలో మాత్రం సమస్యలు వెంటాడుతుండడం గమనార్హం. రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 19,84,167 మంది విద్యార్థులు చదువుతున్నారు. బృహత్తర విద్యాపథకం ప్రారంభిస్తున్నాం, అందుకోసం రూ.రెండు వేల కోట్లు కేటాయిస్తున్నట్టు 2021-22 బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. 'మన ఊరు-మనబడి' కార్యక్రమం పేరుతో సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆ నిధుల కోసం ప్రభుత్వ పాఠశాలలు ఎదురుచూస్తున్నాయి. తొలివిడతలో 9,123 స్కూళ్లను ఎంపిక చేసింది. అందు కోసం రూ.3,497.62 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించి బడుల బలోపేతానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.