Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, కర్షక ఐక్యతతో ముందుకెళ్లాలి
- సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా మార్చి 28,29 తేదీల్లో గ్రామీణ బంద్‌ను నిర్వహించనున్నట్టు సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..కార్మిక, కర్షక మైత్రి కోసం సీఐటీయూ కృషిచేస్తోందన్నారు. అందులో భాగంగానే వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐకేఎస్ ఐక్యకార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఏడాది పాటు ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటంతో ఆ మైత్రి మరింత బలపడిందన్నారు. అసమాన పోరాటం వల్ల కేంద్రం దిగొచ్చి మూడు వ్యవసాయక చట్టాలను రద్దు చేయడం, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం దేశ చరిత్రలోనే ఒక మైలురాయి అన్నారు.నాలుగు లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులు కాలరాయబడతాయనీ,వాటికి వ్యతిరేకంగా కార్మికులంతా పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చా రు. అలా చేయని పక్షంలో ఉన్న అరకొర హక్కులు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్మిక కోడ్లను తిప్పికొట్టకపోతే కార్పొరేట్ యాజమాన్యాల చేతుల్లో కార్మికులు కట్టుబానిసలుగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక విధానాలకు వ్యతిరేకంగా జరిగే రెండు రోజుల సమ్మెను పారిశ్రామిక ప్రాంతాల్లో జయప్రదం చేయాలనీ, ఊర్లల్లో గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు, కర్షకులు ఈ సమ్మె ద్వారా కేంద్రానికి హెచ్చరికలు పంపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ..మోడీ ప్రభుత్వం కరోనా కాలంలో పేదలకు మంచి పనులు చేయకుండా కార్పొరేట్లకు మేలు చేసే విధానాలను, రాయితీలు కల్పించిందని విమర్శించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మోడీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నదన్నారు. తెలంగాణలో గ్రామీణ బంద్ జయప్రదం కోసం మూడు సంఘాలు ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగారెడ్డి, టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, అధ్యక్షులు బి.ప్రసాద్, సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు.