Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉక్రెయిన్‌లో తెలుగు బిడ్డలు చిక్కుకుంటే సీఎం కేసీఆర్ కనీసం సమీక్ష నిర్వహించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణిరుద్రమాదేవిని పార్టీలోకి స్వాగతం పలుకుతూ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శ్రీకాంతాచారి, ఉద్యమకారుల చరిత్రను కనుమరుగు చేసి తన చరిత్రే లిఖించుకునే పనిలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. పాలమూరులో మంత్రి సమర్పించిన తప్పుడు అఫిడవిట్ కేసు విషయంలో సాక్ష్యంగా ఉన్న వారిని పోలీసులు వేధిస్తున్నారనీ, వారు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయనీ, అందుకే పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. విజయశాంతి మాట్లాడుతూ..జిట్టా బాలకృష్ణారెడ్డికి కేసీఆర్ మోసం చేశారనీ, ఆనాడు జిట్టా హు అంటే కార్యకర్తల చేతిలో కేసీఆర్ దెబ్బలు తినేవారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని భూములన్నింటినీ అమ్మేస్తున్నారనీ, రాష్ట్ర సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ..కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనన్నారు. సంక్షేమంలో కాదు.. అవినీతిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తున్నదని ఆరోపించారు. ఐదురాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే తమ పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టంతా తెలంగాణపైనేనని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ మాట్లాడుతూ..తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయిందని విమర్శించారు. మీడియా అడిగే ప్రశ్నలకు కూడా కేసీఆర్ సరిగ్గా సమాధానం చెప్పని పరిస్థితి నెలకొందన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ..అమరవీరుల స్తూపం వద్ద నుంచి బీజేపీ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవాలని చూడటం దారుణమన్నారు. ఉద్యమకారులంతా బీజేపీలోకి వచ్చి టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణగా మార్చాలని పిలుపునిచ్చారు. రాణి రుద్రమాదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదువేల పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ నాలుగు దిక్కులా పెద్దాస్పత్రుల నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇవ్వాలని అడుగుతుంటే మద్యంషాపులను ఊరిఊరికీ ఇస్తున్నాడని విమర్శించారు.