Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట చేతికి వచ్చేంత వరకు నిరంతరంగా నీళ్లు ఇవ్వాలి :మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
యాసంగి పంట వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పక్షం రోజుల్లో కోతకు రాబోతున్న యాసంగి వరి పంట కొనుగోలుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం దిగుబడి వచ్చేంతవరకు సాగునీటి విడుదల నిరంతరంగా కొనసాగించాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేయించే విషయంలో కోతలు పెట్టవద్దని, నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో మాదిరిగా ధాన్యం కొనుగోలు విషయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకొని రైతులను మోసం చేస్తే ఊరుకోమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేసే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం అమ్ముకునేందుకు రైతులను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం, ధాన్యం కొనుగోలు చేయించే విషయంలో వారికి అండగా నిలిచి బలమైన పోరాటాలు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, రవి నాయక్, పాదురి శశిధర్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, బావాండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, ఆయూబ్, పోలేబోయిన వరలక్ష్మి, వినోద్ నాయక్, రొంది శ్రీనివాస్, అంకెపాక సైదులు, బాబునాయక్, బొడ్డు బాల సైదులు పాల్గొన్నారు.