Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యార్థులకు గొప్ప అవకాశం
- విద్యాశాఖ అధికారులకు వినోద్‌కుమార్ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) విద్యాసంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) కోర్సుల్లో ప్రవేశాలు ఇంటర్ విద్యార్థులకు గొప్ప అవకాశమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులను సమాయత్తం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆయన సూచించారు. సోమవారం సైన్స్ డే సందర్భంగా ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్‌తో ఆయన మాట్లాడారు. ఆయా కోర్సుల్లో చేరేందుకు ఇంటర్ విద్యార్థులను సన్నద్ధం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐసర్ విద్యాసంస్థలు స్వయంప్రతిపత్తితో కొనసాగుతున్నాయని వివరించారు. బెర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలీ, పూణే, తిరువనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో ఐసర్ సంస్థలున్నాయని చెప్పారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులు మాత్రమే అని విద్యార్థులు సహా తల్లిదండ్రులు భావిస్తున్నారని అన్నారు. అయితే ఈ దృక్పథం మారాల్సిన అవసరముందన్నారు. ఐఐటీలు, ఎయిమ్స్ స్థాయిలో ఐసర్ విద్యాసంస్థను కేంద్ర ప్రభుత్వం స్థాపించిందని గుర్తు చేశారు. విదేశాల్లో చదివే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్ తరహాలో ఐసర్ ద్వారా బీఎస్, ఎంఎస్ కోర్సులు మంచి ప్రాధాన్యతతో ఉన్నాయని వివరించారు. ఈ కోర్సులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలుంటాయని చెప్పారు. సైన్స్ కోర్సులకు ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయో టెక్నాలజీ కోర్సుల్లో విద్యార్థులకు ప్రావీణ్యతను మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు.