Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించింది. అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల వసూలుకు చెక్ పెట్టాలని భావిస్తున్నది. విధివిధానాలను రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో భేటీ కానుంది. గతనెల 21న సమావేశం జరగాల్సి ఉండగా ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి మరణించడం, మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులకు వివిధ రకాల పనులు ఉండడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఏపీసహా ఇతర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రకటించిన విధివిధానాలను కమిటీ పరిశీలించనుంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కొంత అధ్యయనం చేశారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తెచ్చే అవకాశమున్నది. ఈ దిశగా మంత్రివర్గ ఉపసంఘం చర్చించి విధివిధానాలను రూపొందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
అందుకు సంబంధించిన అంశంపైనా చర్చించి మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఉన్న మంత్రివర్గ ఉపసంఘంలో కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎస్ నిరంజన్‌రెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్, టి హరీశ్‌రావు, వి ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజరుకుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కెటి రామారావు సభ్యులుగా ఉన్నారు.