Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని ఏం మారుస్తాడు?
- దిగజారుతున్న ఉపాధి కూలీల జీవన ప్రమాణాలు
- పనులు దొరకక పస్తులుంటున్న కూలీలు :తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్. వెంకట్రాములు, నక్క బాలమల్లేష్
నవతెలంగాణ-కొమురవెల్లి, ప్రజ్ఞాపూర్
ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలోని పేదల బతుకులు మార్చలేని సీఎం కేసీఆర్.. దేశాన్ని బంగారు భారతదేశంగా మారుస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క బాలమల్లేష్ విమర్శించారు. సోమవారం సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మండలం రాంసాగర్, గజ్వేల్ నియోజకవర్గంలోని కొడకండ్ల గ్రామాల్లో ఉపాధిహామీ కూలీల స్థితిగతులపై రాష్ట్రస్థాయి వ్యవసాయ కార్మిక సంఘాల బృందం అధ్యయనం చేశారు. అనంతరం కొమురవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, పనులు మాత్రం ప్రగతి భవన్, పామ్హౌస్ దాటడం లేదని విమర్శించారు. సీఎం జిల్లాలోనే ఉపాధి హామీ కూలీలకు పని దినాలు అయిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చేసిన పనులకు మూడు నెలల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో కూలీలు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు ధర్నాలు చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. మూడెకరాల భూమి పేరుతో దళితులను మోసం చేశారన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీలకు రోజు కూలి రూ.600కు పెంచాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈయేడు బడ్జెట్లో తక్కువ నిధులను కేటాయించి.. 'ఉపాధి'ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగ నాటకాలను ఎండగట్టేందుకు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉమ్మడి కార్మిక సంఘాలు బీకేఎంయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐఏడబ్ల్యూయూ, దళిత బహుజన ఫ్రంట్, డీబీఎఫ్ ఏకమై వ్యవసాయ కూలీలను చైతన్య పరచాలన్నారు. ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున పోరాటానికి ఏప్రిల్ 16న హైదరాబాద్లో రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నామని, వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు కొక్కొండ కాంతయ్య, సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, వ్యకాస సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొంగరి వెంకట్ మావో, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, డీబీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏగొండ స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అశోక్ మల్లేష్, రాంసాగర్, అయినాపూర్ గ్రామ సర్పంచ్లు తాడూరి రవీందర్, చెరుకు రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.