Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కిన మున్సిపల్ కార్మికుడు
నవతెలంగాణ-కామారెడ్డి టౌన్
అకారణంగా తనను విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఓ మున్సిపల్ కార్మికుడు విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపేట్ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లాలోని పాత రాజంపేట్ గ్రామానికి చెందిన ఘనపురం పురుషోత్తం కామారెడ్డి మున్సిపాలిటీలో నాలుగేండ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కావాలని తనను పనిలోనుంచి తొలగించేలా చేశారని పురుషోత్తం ఆరోపిస్తున్నారు. తనను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన ఉద్యోగం పోవడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పురుషోత్తమ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వినిపించుకోకుండా కలెక్టర్ వస్తేనే కిందకు దిగుతామని బీష్మించాడు. సుమారు రెండు గంటల పాటు టవర్‌పై హల్చల్ సృష్టించాడు. అటువైపుగా వెళ్తున్న కామారెడ్డి ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్.. టవర్ దగ్గర కాసేపు ఆగి వివరాలు తెలుసుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగి వచ్చాడు. పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించారు.