Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కాలువలో దూకిన తల్లి
- తల్లిని కాపాడిన కానిస్టేబుల్.. పిల్లలు మృతి
నవతెలంగాణ-నందిపేట్
ఆర్థిక ఇబ్బందులతో ఏర్పడ్డ కుటుంబ కలహాలు ఇద్దరు చిన్నారుల పాలిట మృత్యుపాశమయ్యాయి. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా.. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ గమనించి తల్లిని కాపాడాడు. గల్లంతయిన ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు నందిపేట్ మండల కేంద్రానికి చెందిన పల్లెపు అమృతకు నాలుగేండ్ల కిందట పెండ్లి జరిగింది. వీరికి ఒక కూతురు మనస్వీయ(3), కొడుకు మనుతేజ(6 నెలలు) ఉన్నారు. వివాహం అనంతరం కుటుంబం నందిపేట్‌కు వచ్చి పని చేసుకుంటూ జీవిస్తున్నది. కాగా ఆర్థిక ఇబ్బందులుండటంతో భర్తను దుబారు వెళ్లాల్సిందిగా అమృత సూచించింది. అందుకు ఒప్పుకోని భర్త.. ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇక్కడే ఉంటాననే విషయంలో కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ కోసం భర్త ఆర్మూర్ వెళ్లగా.. తాను చెప్పినా వినిపించుకోవడం లేదని క్షణికావేశంలో అమృత తన కూతురు, కొడుకుతో కలిసి ఐలాపూర్ వెళ్లే రోడ్డు మార్గంలోని కెనాల్ బ్రిడ్జి వద్ద గుత్ప ఎత్తిపోతల కాలువలోకి దూకింది. అటుగా వెళ్తున్న స్థానికుడైన 7వ బెటాలియన్ కానిస్టేబుల్ ఐనర్ల రాకేశ్ తక్షణమే స్పందించి కాలువలోకి దూకి తల్లిని రక్షించాడు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పిల్లలు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మురళి తమ సిబ్బందితో కలిసి గాలింపు చర్యల్లో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఏఈతో మాట్లాడి నీటి విడుదలను నిలిపివేశారు. స్థానిక జాలర్లతో కాలువలో వెతికించగా.. చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు విచారణ చేపట్టామని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.