Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల దగాపై చర్చకు సిద్ధమా?
- డ్రామాలాడుతున్న మోడీ, కేసీఆర్ :సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
- పాదయాత్రకు సంఘీభావం తెలిపిన టీడీపీ
నవతెలంగాణ-ముదిగొండ
కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల పేరుతో నిలువు దోపిడీ చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్ స్వాహా చేశారని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం, గోకినేపల్లి, చిరుమర్రి, ముదిగొండ గ్రామాల్లో సోమవారం రెండవ రోజు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. రైతులకు పెట్టుబడి సాయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నామని గొప్పలు చెబుతూ వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిపివేశారని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఎనిమిదేండ్లుగా ఒక ఎకరానికి కూడా ఇన్పుడ్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, ట్రాక్టర్ల కొనుగోలుపై ఇచ్చే సబ్సిడీ ఎత్తివేశారని తెలిపారు. ఎకరానికి పెట్టుబడి సాయంగా పది వేలు ఇచ్చి రైతులపై రూ.30 వేల భారం వేస్తున్నది వాస్తవమా.. కాదా అని.. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా.. అని సీఎం కేసీఆర్కు భట్టి సవాల్ విసిరారు.
కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రూ.1.25 లక్షల కోట్లను టీఆర్ఎస్ పాలకులు దోపిడీ చేశారని ఆరోపించారు. రూ.28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి రూ. 1.25 లక్షల కోట్లకు పెంచారన్నారు. నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన ఇందిరా రాజీవ్ సాగర్ ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా మార్చి ఎనిమిదేండ్లుగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వని ఆసమర్ధ, అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. నకిలీ విత్తనాలు అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పేరిట పాలకులు దండుకున్న ప్రజాసంపదను ప్రజలకు పంపిణీ చేయడానికే తాను పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ప్రజలిచ్చిన సమస్యల విన్నపాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు.
కాగా, గోకినేపల్లిలో భట్టికి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. కోలాటం డప్పు వాయిద్యాలతో భట్టి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. చిరుమర్రిలో రాత్రి బస చేశారు. ఆయా గ్రామాల్లో అంబేద్కర్, మహాత్మా గాంధీ, దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
భట్టి పాదయాత్ర 15 కిలోమీటర్ల మేరకు కొనసాగింది. ఈ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి దుర్గాప్రసాద్, నాయకులు రాయల నాగేశ్వరరావు, పాదయాత్ర నియోజకవర్గ కన్వీనర్ మాజీ జెడ్పీటీసీ బుల్లెట్ బాబు, టీడీపీ మండల అధ్యక్షకార్యదర్శులు కనపర్తి వీరబాబు, గుర్రం సంగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షకార్యదర్శులు కొమ్మినేని రమేష్ బాబు, పందిరి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.