Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి కొనుగోలు పథకం లబ్దిదారుల ఎదురుచూపులు
- ఎంపిక చేసిందే అరకొర.. నేటికీ పూర్తికాని అమలు
- 2017 నుంచి స్కీం పూర్తిగా ఎత్తివేత
- మంజూరైన బోర్ల డ్రిల్‌కు ముందుకు రాని బోర్ యజమానులు
- ప్రభుత్వం రేటు పెంచాలని డిమాండ్
- నిజామాబాద్ నుంచి వస్తే గతంలో అడ్డగింత?
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
భూమి కొనుగోలు పథకం కింద సాగుభూమిలో బోర్లు వేసుకుని పంటలు పండించుకుందామనుకుంటున్న పేదల ఆశ కలగానే మిగులుతోంది. బోర్లు వేసేందుకు గతంలో నిర్ణయించిన ధర అనుకూలంగా లేదని కామారెడ్డి జిల్లాలోని బోరు యజమానులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకరిద్దరు బోర్లు వేసేందుకు ముందుకొచ్చినా.. 'నిజామాబాద్ జిల్లా వారితో ఇక్కడ ఎలా వేయనిస్తారు' అంటూ అడ్డుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర సర్కారు రేటు పెంచడంలో ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం ఈ పథకాన్ని అటకెక్కించడంతో గతంలో మంజూరయిన వాటికీ మోక్షం కలగడం లేదు. దాంతో ముందు గొయ్యి వెనక నుయ్యిలా తయారయింది కామారెడ్డి జిల్లాలోని ఎస్సీల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల సాగు భూమి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీనిచ్చింది. నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమితో పాటు పంట భూములకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. ఈ స్కీం కింద కామారెడ్డి జిల్లాలో 2014-2021 మధ్య కాలంలో 528 మందికి 1206 ఎకరాలు పంపిణీ చేసింది. జిల్లాలో ఎస్సీల జనాభాతో పోల్చితే నామమాత్రంగానే ఈ పథకం అమలయ్యింది. అయితే కొనుగోలు చేసిన భూములకు నీటి సౌకర్యం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. 2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో మొత్తం 367 మందికి భూమి దక్కగా.. 287 మందికి చెందిన 657.10 ఎకరాల భూమికి నీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం 136 బోరువెల్స్ మంజూరు చేసింది. ఇందులోనూ కేవలం 83 బోర్‌వెల్స్ మాత్రమే వేశారు. ఓ 20 బోర్‌వెల్స్ వేయటానికి భూగర్భ జల శాఖకు సర్కారు అప్పగించింది. అయితే 42 చోట్ల బోరు వాహనాలు వెళ్లేందుకు అనువుగా లేవని నిర్ణయించారు. 2017 నుంచి ఈ స్కీంను సర్కారు ఎత్తేసింది. 2017-18 నుంచి 2020-21 వరకు 161 మందికి 335 ఎకరాల భూమి పంపిణీ చేసింది. కానీ నీటి పారుదల సౌకర్యం కల్పించే స్కీం అమలు చేయడం లేదు.
నాలుగేండ్లుగా పెండింగ్...
కామారెడ్డి జిల్లా భూగర్భ శాఖ వద్ద ప్రస్తుతం సుమారు 20 బోర్లు వేయించే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. ఆ బోర్లు వేయించేందుకు ఇప్పటికే పలుమార్లు బోరు యజమానులు భూగర్భశాఖ ఏడీ సతీష్‌యాదవ్ పలుమార్లు చర్చలు జరిపారు. కానీ బోరు యజమానులు ముందుకు రావడం లేదు. 2018లో సర్కారు నిర్ణయించిన ధర వల్ల తమకు గిట్టుబాటు కాదని అంటున్నారు. నాటితో పొల్చితే డీజిల్ ధరలు పెరిగాయని చెబుతున్నారు. రాష్ట్ర సర్కారు బోర్లు వేసినందుకు రూ.350 ఫీట్ చొప్పున ధర ఖరారు చేసింది. 2018 నుంచి ఇదే ధరకు నిజామాబాద్‌కు చెందిన కొంతమంది బోరు యజమానులు ఎస్సీల భూముల్లో బోర్లు వేశారు. ఆ ధరకు ఆరు నెలల కిందట వరకు బోర్లు వేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ కామారెడ్డికి చెందిన బోరు యజమానులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కామారెడ్డి జిల్లాకు చెందిన భూముల్లో ఆ జిల్లా వారు ఎలా వేస్తారని అడ్డుకున్నట్టు సమాచారం. దాంతో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లావారు కూడా దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం ధరలు పెంచేందుకు సిద్ధంగా లేదు. ఫలితంగా అర్హత పొందిన లబ్దిదారులు తమ భూముల్లో ఎప్పుడు బోర్లు వేస్తారా అని ఎదురుచూస్తున్నారు. పైగా 2017 వరకు మొత్తం 1183.12 ఎకరాల భూమికి గాను కేవలం 657.10 ఎకరాలను మాత్రమే ఎంపిక చేశారు. మిగిలిన 526 ఎకరాల సాగు భూమి యజమానులు సైతం తమ భూముల్లో బోర్లు ఎప్పుడు వేస్తారా అని ఎదురుచూస్తున్నారు. పాత, కొత్త లబ్దిదారులందరి నోట్లో మట్టికొట్టేవిధంగా సర్కారు స్కీం మొత్తం ఎత్తేసింది. ఇక మంజూరయ్యి పెండింగ్‌లో ఉన్న 20 బోర్‌వెల్స్ కార్యరూపం దాల్చడం లేదు.