Authorization
Sat March 22, 2025 09:00:31 am
- ఆరోగ్య లక్ష్మి పథకాన్ని వెనక్కి తీసుకోవాలి
- అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి
- గ్యాస్ లేక.. కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాం
- మా సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేసిన అంగన్వాడీలు
- జైల్లో పెడతామని పోలీసులు బెదిరించినా.. బీష్మించుకూర్చున్న వర్కర్లు
- సీఐటీయూ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
'స్మార్ట్ఫోన్ల లొల్లి మా సావుకొచ్చింది.. గ్రామాల్లో సెల్ఫోన్లకు సిగల్స్ అందక రోజువారి కార్యక్రమాలు ఆన్లైన్ చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల్లోనే అర్థరాత్రి వరకు ఉండాల్సి వస్తోంది. 14 రికార్డులు రాస్తూ మరో ఆదనపు భారం ఆరోగ్య లక్ష్మి పథకంలో 24 రకాల సేవలు ఆన్లైన్లో చేయడం శక్తికి మించిన భారంగా ఉంది. తక్షణమే ప్రభుత్వం ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి' అని అంగన్వాడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ అంశాలతో పాటు మరో 17 డిమాండ్లతో సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ, ఎన్నో ఎండ్లుగా పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏలు ఇవ్వాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కారించాలనీ, లేకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదని బిష్మించుకూర్చున్నారు. దాంతో కార్మికులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి కదిలించేందుకు ప్రయత్నించారు. 'కేసులు పెట్టాల్సి వస్తోంది.. జైల్లో పెడతామని' పోలీసు ఉన్నతాధికారి ఒకరు అంగన్వాడీ కార్మికులను బెదిరించే ప్రయత్నం చేశారు. 'ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. మా సమస్యలకు పరిష్కారమార్గం దొరికే వరకు ఇక్కడి నుంచి కదలబోం' అని గర్జించడంతో వెనక్కి తగ్గిన పోలీసులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతిచ్చారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు వినతిపత్రం అందజేసి తమ గోడు వెలిబుచ్చారు. అనంతరం సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, శ్రామిక మహిళ కన్వీనర్ కవిత మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులపై అదనపు భారం మోపి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. ప్రస్తుతం 14 రికార్డులు రాస్తున్న వర్కర్లకు ఆరోగ్యలక్ష్మి పథకంలోని 24 సేవలనూ ఆన్లైన్లో నమోదు చేయమనడం సిగ్గుచేటన్నారు. అదనపు భారంగా ఉన్న ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లకు స్మార్ట్ఫోన్లపై అవగాహన లేక నానా అవస్థలు పడుతున్నట్టు వాపోయారు. కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు తిన్న తర్వాత వారి ఫొటోలు తీయమని వర్కర్స్‌ను దొంగలుగా అవమానిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీ వర్కర్లు దొంగలు కాదు.. దొంగ పాలకుల గుట్టు బయటపట్టేవారని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చే ముక్కిపోయిన పప్పులు, కుళ్లిపోయిన గుడ్లతో స్థానికంగా లబ్దిదారులతో నానా తంటాలు పడుతూ చాలీచాలని వేతనాలతో సెంటర్లు నడిపిస్తుంటే వారిపై ఆదనపు భారం మోపడమే కాకుండా అవమానకరమైన పనులు చెప్పడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్లకు అందాల్సిన 2018లో కేంద్రం పెంచిన రూ. 1500 చెల్లించాలని, అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ.21వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజ్యలక్మి, సీఐటీయూ నాయకులు పెండ్యాల బ్రహ్మయ్య, మల్లేశం, సాయిబాబు, రుద్రకుమార్, కృష్ణ, ఎల్లేష్, కుర్మయ్య, అంగన్వాడీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.