Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే తెలంగాణలో పీకే టీమ్
- ఐఏఎస్‌లపై ప్రభుత్వం చిన్నచూపు
- నదులకు నడక నేర్పిన కేసీఆర్..ప్రశాంత్ కిషోర్‌ను ఎందుకు తెచ్చుకున్నడు? : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్
సీఎం కేసీఆర్‌కు ఎన్నికలొస్తే ఓడిపోతామనే భయం పట్టుకుందని, అందుకే బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్‌ను తెలంగాణకు తెచ్చుకున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్, బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి డిజిటల్ మెంబర్షిప్ ఎన్‌రోలర్స్ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బోసు రాజు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గీతా రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధులు, నియామకాలు వంటి ఉద్యమ లక్ష్యాలు పక్కన పెట్టారని, నీళ్లు జగన్, నిధులు మెగా కృష్ణా రెడ్డి, నియామకాలు కేసీఆర్ ఇంట్లోకి పోయాయని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లకు విలువ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు నచ్చక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి బయటకు వచ్చారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి రాజీనామా చేయాలని కోరారు. తెలంగాణలోని అన్ని సంక్షేమ శాఖలను బీహార్ ఐఏఎస్లయిన సోమేశ్ కుమార్, ఆర్. అరవింద్ కుమార్, సందీప్ సుల్తానియా రాజ్ కుమార్, ఐపీఎస్ అంజనీకుమార్.. వంటి వాళ్లకే అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నారని విమర్శించారు. నమస్తే తెలంగాణ పేపర్లో, టీ న్యూస్ ఛానెల్లో తెలంగాణ వాళ్లను తీసేసి ఆంధ్రోళ్లను పెట్టుకున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో జాతీయ స్థాయి నాయకులు కూడా ఉన్నారని, ఒక్కో బూత్ తరపున కనీసం వందమందిని సభ్యులుగా చేర్చుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిలభారత యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు సోహెల్, రాష్ట్ర కో ఆర్డినేటర్ రోహన్‌రెడ్డి, జి. నిరంజన్, కాంగ్రెస్ నగర మహిళా అధ్యక్షులు కవిత మహేశ్, మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, నాయకులు లోకేశ్ యాదవ్, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.