Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పింఛన్లు వచ్చేలా చూడండి
- 3, 4 ఏండ్లయినా ఇస్తలేరు.. చచ్చినంక ఇస్తరా?
- ప్రజావేదికలో పింఛన్ బాధితుల ఆక్రందన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'నాకు 71 ఏండ్లు బిడ్డ. నాకంటే ఏజ్‌బార్ తక్కువున్నోళ్లకు పింఛనొస్తుందిగానీ నాకైతే వస్తలేదు. పెద్దపెద్ద మీటింగ్లల్ల సార్లను అడిగిన. ఇగొస్తలేదు..అగొస్తలేదు..నేను సచ్చినంక ఇస్తరా? ఇంత పింఛన్ వస్తే కడుపునిండ తింట. చారుబొట్టు తాగుత. కేసీఆర్ సారుకు జెప్పి జర పింఛన్ ఇప్పియండి' అంటూ జనగామ జిల్లాకు చెందిన బండి మల్లయ్య వేడుకోలు
'నాకు బోదకాలు వ్యాధి ఉంది సార్. అవస్త పడుకుంట ఇంటికాడ్నే ఉంటున్న. అప్లికేషన్ ఇచ్చొచ్చి రెండేండ్లకుపైనే అయితాంది. రిసీప్టయితే ఇయ్యలే. ఇప్పటిదాకా పింఛనొస్తలేదు. గదొస్తే ఎంతో కొంత 'ఆసరా'అయితదిగదా సార్. జర వచ్చేటట్టు చూడండి' - బోదకాలు వ్యాధిగ్రస్తుడు రాజయ్య
'అందర్కీ నమస్కారం. తాగితాగి లీవర్ కరాబై మూడేండ్ల కింద చచ్చిపోయిండు మా ఆయన. గుంట భూమిగిట్ట లేదు. కూలికెళ్తేగానీ గడవదు. మా అత్తనూ నేనే సాదాలి. కార్యదర్శికి దరఖాస్తు పెట్టుకున్నా పింఛన్ వస్తలేదు. ఎవర్ని అడిగినా వస్తది..వస్తదంటున్నరుగానీ వస్తలేదు. ఎప్పుడొస్తదో ఏమో?' నల్లగొండ జిల్లాకు చెందిన లలిత ఆవేదన
'మా ఆయనతో డైవర్స్ అయ్యి 11 ఏండ్లవుతున్నది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పింఛన్ ఇయ్యట్లేదు. పిల్లలను పట్టుకుని ఇన్నేండ్లు నెట్టుకొంటూ వచ్చిన. నా వేదన ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థంకాక ఈడ్కి వచ్చిన. మా అసోంటి ఒంటరి మహిళలు ఎట్ల బతకాలిసార్? నా అసోంటోళ్లు మా ఊర్ల 80 మంది దాకా ఉన్నరు. వాళ్లకీ పింఛన్లు వస్తలేవు. ఇప్పుడైనా కనికరం చూపి పింఛన్ ఇయ్యండి కేసీఆర్ సారూ' ఇదీ జనగామ జిల్లాకు చెందిన వంగ ప్రేమలత కడుపులోని బాధ.
హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఆసరా పింఛన్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ ఇయరింగ్లో బాధితుల వేడుకోలు..ఆవేదనలు..బాధలు..విన్నపాలు. పెండ్లయి రెండేండ్లు కాకుండానే చనిపోయిన భర్త.. ఓవైపు..చేతిలో ఓ బిడ్డ..అత్తింటి ఆదరణ లేక అర్థంకాని పరిస్థితిలో 21 ఏండ్ల ఒంటరి మహిళ తన గోడును చెబుతుంటే అక్కడున్నోళ్లంతా కంట కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి. ఇలా ఒక్కరేంటి..ఇద్దరేంటి..30 మందికిపైగా తమ గోసలను చెబుతుంటే అయ్యో? ఏమిటీ అన్యాయం అనాల్సిందే. అంతటి బాధలోనూ కేసీఆర్ సారూ పింఛన్ ఇవ్వండి అడిగినోళ్లేగానీ..తిట్టిపోసినోళ్లతే లేరు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర సర్కారు ఎందుకిలా చేస్తుందో అర్థంకాని పరిస్థితి. 21 సంఘాలతో ఏర్పడిన ఆసరా పింఛన్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పబ్లిక్ ఇయరింగ్లో 350 మందికిపైగా బాధితులు పాల్గొన్నారు. వారిలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, ఎయిడ్స్ రోగులు, బోదకాలు బాధితులు, థర్డ్ జెండర్స్ పింఛన్లకు నోచుకోక తామ పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఏస్ అధికారి టి.గోపాల్‌రావు, మానవ హక్కుల వేదిక జాతీయ కన్వీనర్ జీవన్‌కుమార్, సామాజిక వేత్త ఖలీదా ఫర్వీస్, ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా, మహిళా హక్కుల కార్యకర్త బి.గిరిజ వ్యవహరించారు. పింఛన్ల బాధితులు చెబుతున్న వివరాలను నోట్ చేసుకున్నారు. జీవన్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యవస్థ, పరిపాలనా విధానం ఎలాగుందో బాధితులు చెబుతున్న మాటల్లోనే అర్థం అవుతున్నదన్నారు. జీవించే హక్కును హరిస్తున్న రాష్ట్ర సర్కారుపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని తెలిపారు. అధికారులు రాజకీయ నాయకులకు వంత పాడకుండా ప్రజలకు సేవ చేయాలని కోరారు. గోపాల్‌రావు మాట్లాడుతూ..వీళ్లందరి బాధలు విటుంటే ఇలా సమాజంలో ఎందుకున్నాంరయ్యా? అని సిగ్గుతో తల దించుకోవాలని అనిపిస్తోందన్నారు. దరఖాస్తు చేసుకుని నాలుగేండ్లయినా పింఛన్లు మంజూరు కాకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 12 లక్షల పింఛన్లను రాష్ట్ర సర్కారు తగ్గించిందని విమర్శించారు. ఉప ఎన్నికలుంటే పింఛన్లు మంజూరు చేస్తరా? ఇదేం అన్యాయం? ఎన్నికలు వచ్చేదాకా ఎదురుచూడాలా? అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్యవేదిక కార్యదర్శి కన్నెగంటి రవి, నాయకులు విస్సాకిరణ్, కొండల్‌రెడ్డి, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, అంబటి నాగయ్య(తెలంగాణ విద్యావంతుల వేదిక), వ్యవసాయ కార్మిక సంఘం నేత బి.పద్మ, ఆయా సంఘాల నేతలు మంజూల, వెంకటయ్య, ఆశాలత, రేమిన్, వసంతలక్ష్మి, మీరా, ప్రవీణ్, వివిరావు, దీప్తి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.