Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటాయించింది రూ.12,630 కోట్లు.. ఇచ్చింది రూ.7,912 కోట్లు
- మొత్తం అంచనాల్లో ఇది 62 శాతమే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చి నట్టు... అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర బడ్జెట్లో కోతలు సబ్సిడీలపై ప్రభావం చూపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో సబ్సిడీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12,630 కోట్లను కేటాయిచింది. అందులో గత డిసెంబరు నాటికి రూ.7,912 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఆ రూపంలో రూ.4,718 కోట్లు కోతలు పడ్డాయి. ఫలితంగా వ్యవసాయం, వృత్తిదారులు, వారికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీలు, ఆర్టీసీ రాయితీలు, విద్యార్థులు, స్వాతంత్య్ర సమర యోధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు గలవారు, ఒంటరి మహిళలు తదితరులకు ఇచ్చే రాయితీల మీద ప్రభావం పడింది. సబ్సిడీల కోసం కేటాయింపులతో పోలిస్తే ఖర్చు 62 శాతంగా నమోదైంది. ప్రస్తుతం మనం మార్చిలో ఉన్నాం. ఈ నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగిసి... 2022-23 వార్షిక బడ్జెట్ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే శాసనసభ బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. అందువల్ల కోతలు పడ్డ సబ్సిడీల పరిస్థితి అదే విధంగా ఉంటుంది తప్ప.. పెద్దగా మార్పేమీ ఉండబోదు. ఆ రకంగా వాటి పేరిట ఖర్చు చేయకుండా వదిలేసిన రూ.4,718 కోట్లు ఇక అంతే సంగతులన్నమాట. సబ్సిడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా కోతలు పెడితే... సంబంధిత రంగాలు, వాటిపై ఆధారపడిన వారికి ఆర్థికంగా నష్టపోతారు. మరోవైపు వేతనాల కోసం రూ.26,081 కోట్లను కేటాయించగా అందులో రూ.22,219 కోట్లను వ్యయం చేశారు. ఇది మొత్తం కేటాయింపుల్లో 85 శాతం. దీంతోపాటు వడ్డీ చెల్లింపుల కోసం సర్కారు రూ.17,584 కోట్లను కేటాయించింది. ఇందులో డిసెంబరు నాటికి రూ.13,520 కోట్లను చెల్లించారు. దీన్నిబట్టి చూస్తే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వేతనాలు, వడ్డీల చెల్లింపుల కోసం ఠంఛన్‌గా ఖర్చు చేస్తున్న సర్కారు... అదే రకమైన ప్రాధాన్యతను సబ్సిడీలకు ఇవ్వటం లేదని తేలింది.